
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ నటించిన చిత్రం 'రైడ్ 2'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 1న థియేటర్లలో విడుదలైంది. గతంలో వచ్చిన రైడ్ మూవీ సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మొదటి రోజే పాజిటివ్ టాక్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లు వసూలు చేసింది. దాదాపు 18 రోజుల తర్వాత ఈ బెంచ్‌మార్క్‌ను అధిగమించింది. దీంతో ఈ సంవత్సరం విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఛావా తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది.
ఈ సినిమాకు రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. ఈ మూవీ విడుదలైన 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 201.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కేవలం ఇండియాలో మాత్రమే రూ. 177.50 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఇటీవల విడుదలైన హాలీవుడ్ మూవీ 'మిషన్: ఇంపాజిబుల్-ది ఫైనల్ రికనింగ్' కారణంగా రైడ్-2 కలెక్షన్స్ కొద్దిగా తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా రూ. 151.50 కోట్ల నెట్ వసూళ్లు కలెక్ట్ చేసింది.
కాగా.. 'రైడ్ 2' ఊహించిన దానికంటే థియేటర్లలో బాగానే నడుస్తోంది. అజయ్ దేవగణ్ కెరీర్‌లో రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా రైడ్-2 నిలిచింది. గతేడాది నవంబర్‌లో దీపావళికి విడుదలైన 'సింగం ఎగైన్' తర్వాత ఈ మూవీ రికార్డ్ సాధించింది. అయితే 2018లో విడుదలైన 'రైడ్' ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 154 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీలో వాణి కపూర్ హీరోయిన్‌గా నటించగా.. రితేష్ దేశ్‌ముఖ్, సౌరభ్ శుక్లా ముఖ్య పాత్రల్లో నటించారు.