
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ప్రముఖ కాస్మెటిక్ బ్రాండ్ కోసం చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో సోషల్ మీడియా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు యూత్‌ను ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఈమేరకు ఆమెపై నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుర్తింపు కోసం సోషల్‌మీడియా మాయ ప్రపంచంలో చిక్కుకుంటున్నారని.. ఈ అంశం తనకు ఎక్కువ ఆందోళన కలిగిస్తుందంటూ ఐశ్వర్య వ్యాఖ్యలు చేశారు.
సోషల్‌మీడియాలో వచ్చే లైక్స్, కామెంట్స్ మన జీవితాలను నిర్ణయించలేవని ఐశ్వర్య రాయ్ చెప్పుకొచ్చారు. 'నేటి సమాజంలో మన విలువను ఎవరూ నిర్ణయించలేరు. చాలామంది సోషల్‌మీడియా ట్రాప్‌లో పడుతున్నారు. వారు చేసే పోస్ట్‌లకు వచ్చే లైక్స్, కామెంట్లు, షేర్‌లు చూసుకొని సంబరపడుతుంటారు. వాటిలో ఎవీ కూడా మనలోని ఆత్మవిశ్వాసాన్ని ఈ ప్రపంచానికి చూపలేవు. కానీ, నువ్వు నీలా ఉంటే అసలైన ప్రపంచం కనిపిస్తుంది. మీకు కావాల్సిన ఆత్మగౌరవం కోసం ఇంటర్నెట్‌లో వెతకొద్దు. ఒక్కసారి దానిని దాటి ముందుకు రండి మీకు దక్కాల్సిన గౌరవం తప్పకుండా దొరుకుతుంది. సోషల్‌మీడియా అంశంపై ఒక మహిళగా, తల్లిగా నాకు ఆందోళన కలుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనికి బానిసలు అవుతున్నారు.. దయచేసి అందులో నుంచి బయటపడండి.' అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చారు.
దీంతో ఐశ్వర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేటి యూత్‌కు కావాల్సిన మెసేజ్‌ను అందించారని కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచంలో సగం మంది ఆమె చెప్పేది అర్థం చేసుకుంటే బాగుండు అంటూ అభిప్రాయ పడుతున్నారు. ఈ యుగంలో చాలా అవసరమైన సందేశాన్ని అందించారంటూ చాలామంది ఆమెను ప్రశంసించారు.