
మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి సోషల్మీడియాకు గుడ్బై చెప్పేసింది. ఇకనుంచి తాను ఎలాంటి పోస్ట్లు. అభిప్రాయాలను తన ఖాతాలో పోస్ట్ చేయనని చెప్పింది. మలయాళంలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య.. తెలుగులోనూ 'గాడ్సే', 'అమ్ము' తదితర చిత్రాల్లో నటించింది. థగ్ లైఫ్, మామన్, కింగ్ ఆఫ్ కొత్త, మట్టి కుస్తీ, పొన్నియన్ సెల్వన్-2 వంటి చిత్రాలతో ఆమె పాపులర్ అయింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్‌తో సంబరాల ఏటి గట్టు చిత్రంలో ఆమె నటిస్తుంది.
సోషల్మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ఐశ్వర్య లక్ష్మి ఇలా చెప్పుకొచ్చింది. ' ప్రస్తుతం సినిమా అనే ఆటలో నేను ఉండాలంటే సోషల్ మీడియా చాలా ముఖ్యం. ఈ మాటకు నేను ఏకీభవిస్తున్నాను. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే.., కాలానికి అనుగుణంగా మారడం అవసరమని నేను భావించాను. ఈ క్రమంలోనే ఏదో విధంగా కొన్ని అంశాల్లో సోషల్మీడియా నాకు అనుకూలంగా ఉంటుందని భావించాను. ఈ నిర్ణయమే అలవాటు పడేలా చేసింది. అయితే, అది నా పనిని పూర్తిగా డిస్ట్రబ్ చేసింది. నేను చేయాలనుకున్న పనులకు దూరం చేసింది. నాలోని దాగి ఉన్న నిజమైన ఆలోచనలను సోషల్మీడియా దోచుకుంది. నా చిన్న చిన్న ఆనందాన్ని కూడా దుఃఖంగా మార్చేసింది. నా భాషను, పదాలను దెబ్బతీసింది. నా బాల్య ఆనందాలన్నింటినీ తీసివేసింది.
ఒక మహిళగా, సోషల్ మీడియా వల్ల వచ్చిన ఇబ్బందులను ఎదుర్కునేందుకు చాలా కష్టపడ్డాను. ఇంటర్నెట్ కోరుకునే ఊహలకు తగ్గట్టుగా నేను జీవించలేకపోతున్నాను. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ లేని వారిని ప్రజలు నెమ్మదిగా మరచిపోతారని నాకు తెలుసు.. కానీ, నేను ఆ సాహసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక నటిగా, మహిళగా, నేను సరైన నిర్ణయం ఎంచుకున్నట్లు అనుకుంటున్నాను.' అని ఆమె తెలిపింది.
నాలోని కళాకారిణిని, నాలో దాగిన అమాయకత్వం, వాస్తవికతను నిలుపుకోవడానికి నేను ఇంటర్నెట్‌కు పూర్తిగా దూరంగా ఉంటాను. నేను సరైన దారిలో వెళ్లాలనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. దీని ద్వారా నా జీవితంలో మరింత బలమైన బంధాలు ఏర్పడుతాయనుకుంటున్నా.. ఎక్కువ సినిమాలలో నటించగలనని ఆశిస్తున్నాను. నేను మంచి సినిమాలు చేస్తూనే ఉంటా.. మునుపటిలాగా నన్ను ప్రేమతో గుర్తుపెట్టుకోండి. మర్చిపోకండి. ప్రేమతో మీ ఐశ్వర్య లక్ష్మి.' అంటూ షేర్ చేసింది.