
జయాపజయాలు అనేవి ఎవరి చేతుల్లోనూ ఉండవు. ఇంకా చెప్పాలంటే అపజయాలను ఎదుర్కోని మనిషే ఉండడు. సినిమా రంగం ఇందుకు అతీతం కాదు. ముఖ్యంగా మణిరత్నంకు ఇండియన్ ఏస్ డైరెక్టర్ అనే పేరు ఉంది. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు అలాంటివి. ఓ నాయకన్, ఒక దళపతి ,ఒక ముంబాయి ఇలా చెప్పుకుంటూ పోతే మణిరత్నం దర్శకత్వం వహించిన ఆణిముత్యాల్లాంటి చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇటీవల కూడా పొన్నియన్ సెల్వన్ అంటే చారిత్రిక కథా చిత్రాన్ని ఆయన అద్భుతంగా సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించారు. అలాంటి దర్శకుడు తాజాగా దర్శకత్వం వహించిన థగ్‌లైఫ్ చిత్రం నిరాశపరిచింది. దీంతో ఆయనపై విమర్శల దాడే జరిగింది. అలాగని మణిరత్నం కృంగిపోలేదు. అలాగైతే ఆయన అన్ని సూపర్ హిట్ చిత్రాలను అందించే వారే కాదు.

తాజాగా మరో యూత్ ఫుల్ లవ్‌స్టోరీతో రావడానికి సిద్ధమవుతున్నారన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. అందుకు ఆయన యువ నటుడు, స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్‌ను కథానాయకుడిగా ఎంచుకున్నట్లు, కథానాయిక రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ధ్రువ్ విక్రమ్ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈయన మారిసెల్వరాజ్ దర్శకత్వంలో బైసన్ అనే చిత్రంలో నటిస్తున్నారు.
క్రీడా నేపథ్యంగా రూపొందుతున్న బైసన్ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. కాగా తదుపరి ధ్రువ్‌విక్రమ్ మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రుక్మిణి వసంత్ జంటగా నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని సెప్టెంబర్‌లో సెట్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారికంగా త్వరలో వెలుపడే అవకాశం ఉంది.