అనురాగ్ కశ్యప్‌, తాప్సీలపై ఐటీ దాడులు: రూ.350 కోట్లకు పన్ను ఎగవేత | Sakshi
Sakshi News home page

అనురాగ్ కశ్యప్‌, తాప్సీలపై ఐటీ దాడులు: రూ.350 కోట్లకు పన్ను ఎగవేత

Published Thu, Mar 4 2021 9:39 PM

After Raids On Anurag Kashyap And Taapsee Pannu Tax Officials Claim Crores Hidden - Sakshi

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, హీరోయిన్‌ తాప్సీ నివాసాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై కక్ష్య కట్టి ఇలా దాడులు చేస్తున్నారని విపక్షాలు విమర్శించాయి. కావాలనే వారిని ఇబ్బంది పెట్టడానికి ఇలా దాడులు చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం కూడా తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఐటీ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రొడక్షన్‌ కంపెనీకి సంభందించి వందల కోట్ల రూపాయలకు పన్ను ఎగ్గొట్టారని తెలిపారు. 

ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ భారీ ఆదాయాన్ని ఆర్జించింది. అయితే దాన్ని లెక్కల్లో వెల్లడించలేదు. సుమారు 300 కోట్ల రూపాయలకు కంపెనీ అధికారులు సరైన పత్రాలు చూపించలేకపోతున్నారు. ప్రొడక్షన్‌ కంపెనీ లావాదేవీలను తారుమారు చేశారు. వాస్తవ విలువకు బదులు తక్కువ విలువను లెక్కల్లో చూపించారు. అంతేకాక దాదాపు రూ. 350 కోట్ల రూపాయలకు పన్ను ఎగవేశారు. ఇక ప్రముఖ నటి కేవలం 5 కోట్ల రూపాయలకు సంబంధించిన నగదు రశీదులను మాకు అందజేశారు. అలానే ప్రముఖ నిర్మాత/దర్శకుడికి సంబంధించి సుమారు 20 కోట్ల రూపాయలకు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్‌లు సమర్పించారు.. ఈ మొత్తాని కూడా పన్ను ఎగవేశారు.. నటి విషయంలో కూడా ఇలాంటి అంశాలే వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. త్వరలోనే పూర్తి వివరాలు అందిస్తాం’’ అన్నారు. 

ఐటీ శాఖ అధికారులు తాప్సీ, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈవో శుభాషిశ్‌ సర్కార్‌ తదితరుల నివాసాల్లో తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ముంబై, పుణెలోని 30 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్టు చెప్పారు. టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు ‘క్వాన్‌', ఎక్సీడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రతినిధుల కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఉదయం ప్రారంభమైన సోదాలు రాత్రి పొద్దు పోయేదాకా కొనసాగాయి. పలు పత్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అనంతరం తాప్సీ, కశ్యప్‌ను అధికారులు ప్రశ్నించారు.

కశ్యప్‌ 2011లో ‘ఫాంటమ్‌ ఫిల్మ్స్‌' పేరిట ఒక నిర్మాణ సంస్థను స్థాపించారు. 2018లో దీన్ని మూసివేశారు. అయితే ఈ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై ఐటీశాఖ దర్యాప్తు జరుపుతున్నది. అందులో భాగంగానే ఆ సంస్థ ప్రమోటర్లు అయిన అనురాగ్‌ కశ్యప్‌, దర్శకనిర్మాత విక్రమాదిత్య మోత్వానే, నిర్మాత వికాశ్‌ బెహల్‌, డిస్ట్రిబ్యూటర్‌ మధు మంతెన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.

చదవండి: 
అనురాగ్‌ కశ్యప్‌, తాప్సీ నివాసాలపై ఐటీ దాడులు
‘లోదుస్తులతో ఫోటోలు షేర్‌.. నీ రేటెంత’

Advertisement
Advertisement