
చిత్రపరిశ్రమలో హీరోలకు వయసుతో సంబంధం ఉండదు కానీ..హీరోయిన్లకు మాత్రం కచ్చితంగా ఉంటుంది. 30-35 ఏళ్లు దాటితే చాలు చాన్స్‌లు తగ్గుతాయి. అలా పట్టుమని పదేళ్లు కూడా హీరోయిన్‌గా రాణించలేరు. వయసు ఉన్నా.. ఖాతాలో హిట్ లేకపోతే అంతే సంగతి. వరుసగా 3-4 ఫ్లాపులు పడ్డాయంటే.. ఇక ఆమె వెండితెరపై మర్చిపోవాల్సిందే. ప్రస్తుతం పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్లు చాలా తక్కువే ఉన్నారు. కానీ ఒకప్పుడు హీరోయిన్ స్పాన్ 20 ఏళ్ల వరకు ఉండేది. భారీ హిట్స్ వస్తే..ఆమెను నెత్తినపెట్టుకొని ఆరాధించేవాళ్లు. హీరోలతో సమానంగా వాళ్లకు అభిమానులు ఉండేవాళ్లు. అలాంటి వాళ్లలో రమ్యకృష్ణ(Ramya Krishnan) ఒకరు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె హీరోయిన్‌గా నటించింది.
13 సంవత్సరాల వయస్సులోనే ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళ చిత్ర దర్శకుడు, సి.వి. శ్రీధర్ దర్శకత్వంలో 1983లో విడుదలైన వెల్లై మనసుతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. . మె తొలి తెలుగు చిత్రం భలే మిత్రులు (1986). చిరంజీవి,నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్..ఇలా అప్పటి స్టార్ హీరోలందరితోనూ ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది. అంతేకాదు ‘అక్కినేని’ హీరోలందరితోనూ నటించిన రికార్డు ఆమె పేరిట ఉంది. అక్కినేని నాగేశ్వరరావు మొదలు అఖిల్ వరకు.. మూడు తరాలతో రమ్యకృష్ణ కలిసి నటించింది.
అక్కినేని నాగేశ్వరరావుతో ‘దాగుడు మూతలు దాంపత్యం, ఇద్దరే ఇద్దరు, సూత్రధారులు సినిమాల్లో కలిసి నటించింది. ఇక నాగార్జునతో ఆమె 10కి పైగా సినిమాలు చేసింది. అందులో హల్లో బ్రదర్, సంకీర్తన, చంద్రలేఖ, అన్నమయ్య, అల్లరి అల్లుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఉన్నాయి.
ఇక అక్కినేని మూడో తరం.. నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్యతోనూ రమ్యకృష్ణ స్క్రీన్ షేర్ చేసుకుంది. శైలజా రెడ్డి సినిమాలో చైతుకి అత్తగా, బంగార్రాజు చిత్రంలో నానమ్మగా నటించింది.
నాగ్ చిన్న కొడుకు అఖిల్ ‘హలో’ మూవీలోనూ రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఇలా అక్కినేని మూడు తరాలతో నటించిన ఏకైన హీరోయిన్‌గా రమ్యకృష్ణ నిలిచింది. సమంత కూడా ఈ నలుగురితో కలిసి ‘మనం’ సినిమాలో నటించింది. అయితే విడివిడిగా నటించిన ఏకైక నటి మాత్రం రమ్యకృష్ణ అనే చెప్పాలి.