
హత్య కేసులో బెంగళూరు పరప్పన జైల్లో ఉన్న ప్రముఖ నటుడు దర్శన్‌కు కనీస సౌకర్యాలు కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఆయన ఆరోపణలతో వాస్తవాలను పరిశీలించేందుకు ఉన్నత న్యాయస్థానం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బెంగళూరు 57వ సీసీహెచ్ కోర్టుకు న్యాయసేవ ప్రాధికార కార్యదర్శి వరదరాజ నివేదికను అందించారు. ఆయనకు నిబంధనల ప్రకారం అందాల్సిన సౌకర్యాలు ఉన్నాయని వారు తెలిపారు. తనకు ఫంగస్ సోకిందని దర్శన్ అబద్ధం చెబుతున్నారంటూ చర్మవ్యాధుల చికిత్స నిపుణురాలు జ్యోతిబాయితో చేయించిన పరీక్ష నివేదికను కూడా న్యాయస్థానంలో అందజేశారు. రేణుకాస్వామి హత్య కేసులో తమకు బెయిలు మంజూరు చేయాలని దర్శన్, పవిత్రాగౌడ తదితరులు వేసుకున్న అర్జీ విచారణ 24వ తేదీకి వాయిదా పడింది.
వసతులు సాధ్యం కాదు
● దర్శన్‌కు పరుపు, దిండు ఇవ్వలేం, విచారణ ఖైదీకి ఇలాంటి సౌకర్యాలు ఇవ్వడం సాధ్యం కాదని జైలు అధికారులు స్పష్టం చేసినట్లు నివేదికలో తెలిపారు.
● దర్శన్ బ్యారక్‌లో దేశీయ, పాశ్చాత్య శైలి కమోడ్లు ఉన్నాయి, ఆయన గంటపాటు ఎండలో వాకింగ్ చేయడానికి సౌకర్యం ఉంది.
● దర్శన్ వాకింగ్ చేస్తుంటే ఇతర ఖైదీలు చూసి కేకలు వేస్తున్నారు. సెలబ్రిటీ కావడం వల్ల అతనికి కలవడానికి యత్నిస్తున్నారు. బయట వాకింగ్ చేయనిస్తే, జైలు చుట్టు పక్కల అపార్ట్‌మెంట్‌లలో ఉన్నవారు ఫోటోలు, వీడియోలు తీసుకునే అవకాశం ఉంది.
● టీవీ ఇవ్వలేదంటున్నారు, అందరికీ ఓ హాల్‌లో టీవీ ఉంటుంది. బ్యారక్‌లో టీవీని అమర్చడం సాధ్యం కాదు అని జైలు అధికారులు చెప్పినట్లు తెలిపారు.
● బంధుమిత్రులతో ఫోన్‌లో మాట్లాడితే కాల్స్‌ను రికార్డ్ చేస్తున్నారన్న దర్శన్ ఆరోపణలపై.. అది జైలు నియమమని చెప్పారు.
● అరికాలికి ఫంగస్ వచ్చి పగుళ్లు రావడం వల్ల నొప్పులు వస్తున్నట్లు తెలిపారు. దర్శన్‌ను వైద్యులు వారానికి రెండుసార్లు పరిశీలిస్తున్నట్లు నివేదికలో వివరించారు.