
ఓటీటీల్లో థ్రిల్లర్, హారర్ సినిమాలకు ఉండే డిమాండ్ వేరు. అందున హాలీవుడ్ నుంచి ఈ జానర్ మూవీస్ వస్తున్నాయి అంటే కచ్చితంగా భయపెట్టి తీరేలానే ఉంటాయి. అలా జూన్‌లో థియేటర్లలోకి వచ్చిన ఓ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అదే '28 ఇయర్స్ లేటర్'(28 ఏళ్ల తర్వాత). ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది. 'స్లమ్ డాగ్ మిలీయనీర్'ని తీసిన డేనీ బోయెల్ దీనికి దర్శకుడు. మరి ఈ సినిమా అంతలా భయపెట్టిందా అనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: 'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు'.. టాక్ ఏంటి?)
కథేంటి?
2002లో రేజ్ వైరస్ రాకతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంది. అలా 28 ఏళ్లు గడిచిపోతాయి. బ్రిటన్‌లోని ఓ దీవిలో ఈ వైరస్ బారిన పడని కొంతమంది జీవిస్తుంటారు. హీరో జేమీ తన 12 ఏళ్ల కొడుకు స్పైక్, భార్యతో కలిసి బతుకుతుంటాడు. ఓ రోజు వేట కోసం జేమీ, స్పైక్.. మెయిన్ ల్యాండ్‌కు వెళ్తారు. ఇక్కడ మెయిన్ ల్యాండ్ అంటే జాంబీలు ఉండే ప్రదేశం. అక్కడ 'ఆల్ఫా' అనే బలమైన జాంబీ ఈ తండ్రి కొడుకులకు ఎదురుపడుతుంది. తర్వాత ఏమైంది? తిరిగి ద్వీపానికి చేరుకున్నారా లేదా అనేది మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
ఇదో జాంబీ సినిమా. అంటే వైరస్ సోకేసరికి చాలామంది మనుషులు రాక్షసుల్లా మారిపోతారు. వీళ్ల నుంచి తప్పించుకున్న కొందరు ఓ ద్వీపంలో తలదాచుకుంటారు. ఆ ద్వీపానికి జాంబీలు ఉండే ప్రదేశానికి మధ్యలో చిన్న దారి ఉంటుంది. కానీ రాత్రయితే ఆ దారి అంతా సముద్రంలో మునిగిపోతూ ఉంటుంది. అలాంటి వీళ్లలోని ఓ తండ్రి కొడుకు జాంబీల దగ్గరకు వెళ్తారు. తర్వాత ఊహించి పరిస్థితులు ఎదురవుతాయి. అక్కడి నుంచి పాత్రల మధ్య ఎలాంటి సంఘర్షణ ఏర్పడుతుంది. తర్వాత ఏమైందనేది మూవీ చూసి ఎక్స్‌పీరియెన్స్ చేయాలి.

ఈ సినిమాని కచ్చితంగా ఒంటరిగానే చూడండి. అలా అని బూతు సన్నివేశాలు ఏం ఉండవు. జాంబీలన్నీ బట్టల్లేకుండానే ఉంటాయి. కానీ ఒంటిపై బురదలాంటిది ఉంటుంది. కానీ జాంబీలని భయంకరంగా చంపడం లాంటి సీన్స్ ఉంటాయి. ఇదో హారర్ మూవీ అయినప్పటికీ మరోవైపు థ్రిల్ పంచుతూ మానవ సంబంధాలు, భావోద్వేగాలని కూడా చూపిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.
రెండు గంటల్లోపే ఉండే ఈ సినిమా నెమ్మదిగానే ఉంటుంది గానీ విజువల్స్ గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ డిఫరెంట్ అనుభూతిని ఇస్తుంది. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ కూడా మూవీలో మీరు లీనమయ్యేలా చేస్తుంది. తెలుగు డబ్బింగ్ పర్లేదు. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్ని ఐఫోన్‌తో తీయడం విశేషం. అమెజాన్ ప్రైమ్, జీ5 తదితర ఓటీటీల్లోనూ ఉంది గానీ వాటిలో రెంట్ పద్ధతిలో చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో ఫ్రీగా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ థ్రిల్లర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే దీనిపై ఓ లుక్కేసేయండి.
-చందు డొంకాన
(ఇదీ చదవండి: రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ))