
తెలుగులో అప్పుడప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్, ఎక్స్‌పరీమెంట్ మూవీస్ వస్తుంటాయి. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఆకట్టుకుంటూ ఉంటాయి. కానీ ఇప్పుడు 100 నిమిషాల సింగిల్ టేక్ మూవీ అంటూ ఒకటి థియేటర్లలో రిలీజైంది. అదే 'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు'. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది?
సూపర్ రాజా అనే వ్యక్తి.. తాను తీసిన ఈ సినిమా గురించి తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఊళ్లు తిరుగుతూ గత ఏడాదిన్నరగా ప్రమోషన్ చేసుకున్నాడు. మధ్య తరగతి వ్యక్తి, సొంతంగా ఓ మూవీకి రైటర్, హీరో, నిర్మాతగా చేశాడు అనేసరికి సోషల్ మీడియాలో కాస్త ఆసక్తి కలిగింది. నిన్న అంటే శుక్రవారం (సెప్టెంబరు 19)న ఇది థియేటర్లలో రిలీజైంది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేయడంతో కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అసలు 100 నిమిషాల సినిమాని సింగిల్ టేక్‌లో ఎలా తీసి ఉంటాడా అని ప్రేక్షకులు థియేటర్లకి వెళ్లారు. కానీ ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. కొందరైతే దారుణంగా తిడుతున్నారు.
(ఇదీ చదవండి: కొంపముంచిన కామెడీ స్పూఫ్.. ఏకంగా రూ.25 కోట్ల దావా)
ఈ సినిమా విషయానికొస్తే.. హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆమె ఇతడిని కాదనుకుని జర్మనీ వెళ్లేందుకు రెడీ అయిపోతుంది. దీంతో ఎలాగైనా సరే ఆమెని కలుసుకోవాలని హైదరాబాద్ సిటీలోని ప్యారడైజ్ నుంచి హీరో, అతడి ఫ్రెండ్... హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు బైక్‌పైన వెళ్తారు. ఇదే స్టోరీ.
ఓ మోటో వ్లాగింగ్ వీడియోని తీసుకొచ్చి దీన్ని సినిమా అని చెప్పడం విడ్డూరంగా ఉందని చాలామంది ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. బైక్‍కి గో-ప్రో కెమెరా తగిలించి ఓ వీడియో తీసి దాన్ని మూవీ అనేయడం ఏంట్రా బాబు అని విమర్శిస్తున్నారు. అసలు ఇదొక మూవీనా అని తిడుతున్న వాళ్లు కూడా ఉన్నారు. ఎందుకంటే సినిమా అనేసరికి థ్రిల్, కామెడీ, ఎమోషన్.. ఇలా ఏదో ఒకటి కోరుకుంటాడు. ఇందులో అలాంటివేం లేకపోవడంతో ప్రేక్షకుడు ఉసూరుమంటున్నాడు. మరోవైపు కొందరు ఇతడి కష్టాన్ని అభినందిస్తున్నారు తప్ప మూవీ బాగుందని మాత్రం చెప్పట్లేదు. ఇంకొందరేమో సినిమా అని చెప్పి సూపర్ రాజా.. భలే మోసం చేశాడని అంటున్నారు.
(ఇదీ చదవండి: ఆస్కార్ రేసులో పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప)