
కామెడీ, ఎంటర్ టైన్మెంట్ షోల్లో రకరకాలుగా ఆకట్టుకుంటూ ఉంటారు. ఎవరైనా సెలబ్రిటీలు వస్తే ఆయా హీరో లేదా హీరోయిన్ల సినిమాల్లోని పాత్రల స్పూఫ్స్ చేస్తూ అలరించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు అలా చేయడం వల్ల ఓ నిర్మాత హర్ట్ అయ్యాడు. ఏకంగా షో నిర్వహకులపై రూ.25 కోట్ల దావా వేశాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియలో చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హిట్ సినిమాల్లో 'హేరా పేరి'కి ప్రత్యేక స్థానం ఉంటుంది. 2000లో వచ్చిన ఈ చిత్రంలో బాబురావు అనే పాత్రలో పరేశ్ రావల్ చేసే కామెడీ ఐకానిక్‌గా నిలిచిపోయింది. సరే ఇదంతా పక్కనబెడితే రీసెంట్‌గా తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం అక్షయ్ కుమార్.. కపిల్ శర్మ షోకి వచ్చాడు. ఈ క్రమంలోనే బాబురావు పాత్ర స్పూఫ్ చేశారు. కమెడియన్ కికు శారదా ఈ పాత్ర మేనరిజాన్ని ఇమిటేట్ చేసి ఆకట్టుకున్నాడు.
(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన రెండు తెలుగు సినిమాలు)
ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేయగా.. 'హేరా పేరి' నిర్మాత ఫిరోజ్ నడియవాలా హర్ట్ అయ్యారు. తన అనుమతి లేకుండా ఈ పాత్రని కపిల్ శర్మలో షోలో ఇమిటేట్ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'బాబురావు అనేది ఓ క్యారెక్టర్ మాత్రమే కాదు. హేరా పేరికి ఆత్మ. మా కష్టం, విజన్, క్రియేటివిటీతో ఆ పాత్రకు ప్రాణం పోశాం. ఆర్థిక లాభాపేక్ష కోసం ఆ పాత్రని ఉపయోగించే హక్కు ఎవరికీ లేదు. ఈ పాత్రని ఇమిటేట్ చేస్తూ ఉన్న కంటెంట్ మొత్తాన్ని సోషల్ మీడియా, నెట్‌ఫ్లిక్స్, టీవీ ఛానెల్స్ నుంచి తొలగించాలి' అని నిర్మాత ఫిరోజ్ సూచించారు.
తన అనుమతి లేకుండా బాబురావు పాత్రని ఇమిటేట్ చేసినందుకుగానూ 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలి. అలానే నోటీసులు అందిన రెండు రోజుల్లోగా రూ.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నిర్మాత ఫిరోజ్.. కపిల్ శర్మ షో నిర్వహకులైన నెట్‌ఫ్లిక్స్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఒకవేళ చేయకపోతే చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. మరి షో నిర్వహకులు ఏం చేస్తారో చూడాలి?
(ఇదీ చదవండి: ఆస్కార్ రేసులో పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప)