అధికారుల అనాలోచితం.. సమస్యలతో సతమతం
నేతల స్వార్థం.. అధికారుల అనాలోచితం.. నిధుల కొరత.. వెరసి మెదక్ బల్దియా అభివృద్ధికి అడుగు ముందుకు పడటం లేదు. ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడంతో ఏళ్ల తరబడి పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. రూ.కోట్లాది రూపాయలు వెచ్చించినా, వినియోగంలోకి రాకుండా పోయాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
– మెదక్‌జోన్
మెదక్ మున్సిపాలిటీ ఏడు దశాబ్దాల క్రితం ఏర్పాటైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 50,721 మంది ఉండగా, ప్రస్తుతం 80 వేల జనాభాకు చేరుకుంది. 15 వేలకు పైగా ఇళ్లు ఉన్నాయి. అయితే ప్రగతి మాత్రం నేటికీ అంతంత మాత్రంగానే ఉంది. పాలకవర్గాల స్వార్థపూరిత విధానాలు, అధికారుల అనాలోచిత నిర్ణయాలు, నిధుల కొరతతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనే విమర్శలు ఉన్నాయి. మెదక్ పట్టణానికి మోడ్రన్ వైకుంఠధామం నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో రూ.1.8 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఆన్‌లైన్ ద్వారా ఓ కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని డంప్‌యార్డు సమీపంలోని ఓ పెద్ద గుంతలో నిర్మించాలని అప్పటి పాలకవర్గం స్థలాన్ని కేటాయించింది. దానికి అధికారులు సైతం వంతు పాడటంతో సదరు కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. ఆ గుంతలోనే రెండు బర్నింగ్ యూనిట్లు నిర్మించాలని నిర్ణయించాడు. ఒకటి పూర్తి చేయగా, మరొకటి పిల్లర్ల స్థాయిలో నిలిచిపోయింది. కట్టెల స్టోర్ గది నిర్మాణం, విజిటింగ్ గది, టాయిలెట్ యూనిట్స్ సైతం నిర్మించాడు. ఇందుకు సదరు కాంట్రాక్టర్ రూ. 60 లక్షలకు పైగా వెచ్చించాడు. అయితే నిధులు విడుదల కాకపోవటంతో పనులు మధ్యలోనే నిలిపివేశాడు. దీనిని పెద్ద గుంతలో నిర్మించటంతో ఏ మాత్రం వర్షం కురిసినా అందులోకి దిగటానికే వీలుండదు.
అక్కరకు రాని నిరాశ్రయుల కేంద్రం
పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో గల ఎంసీహెచ్ సమీపంలో అప్పట్లో రూ. 60 లక్షలు వెచ్చించి నిరాశ్రయిల కేంద్రాన్ని నిర్మించారు. దాని నిర్వహణకు ముగ్గురిని నియమించారు. అక్కడికి వెళ్లాలంటే ఆటో చార్జి రూ. 50 వెచ్చించాల్సి ఉంటుంది. దీంతో అది నిరాశ్రయులకు అక్కరకు రాకుండా పోయింది. అనాథలు అంత దూరం వెళ్లకుండా పట్టణంలోని ఫుట్‌ఫాత్‌లపైనే పడుకుంటున్నారు. దీంతో లక్షలాది రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరులా మారింది.
నిలిచిన నిధులు
పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో మార్కెట్ (ఏఎంసీ) ఆధ్వర్యంలో రైతుబజార్ నిర్మాణం కోసం రెండు విడతల్లో రూ. 6 కోట్లు మంజూరు కాగా పనులు చేపట్టారు. అయితే నిధులు సరిపోకపోవటంతో అర్ధంతరంగా పనులు నిలిచిపోయాయి. ఇంకా లిఫ్ట్, విద్యుత్ సౌకర్యం, వాటర్ తదితర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి కోసం మరో రూ. 2 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించి ఏళ్లు గడుస్తున్నా పైసా విడుదల కాలేదు. ఫలితంగా రైతులు, వ్యాపారులు రోడ్లపైనే కూరగాయల విక్రయాలు జరుపుతుండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఆరేళ్లుగా ఆగిన రైతుబజార్
పిల్లర్ల స్థాయిలోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్
నిధుల కొరతతో నిలిచిన మరిన్ని నిర్మాణాలు
మెదక్ బల్దియా దుస్థితి
అర్ధంతరంగా ఆగిన నిర్మాణం
వెజ్, నాన్‌వెజ్ (ఇంటిగ్రేటెడ్) మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు కాగా, బాలుర, ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మించేందుకు అప్పట్లో అధికారులు స్థల సేకరణ చేశారు. పట్టణానికి చెందిన కొందరు కళాశాల స్థలంలో నిర్మిస్తే దుర్వాసనతో విద్యార్థులకు ఇబ్బందులు పడతారని కోర్టును ఆశ్రయించారు. దీంతో అక్కడి నుంచి ఇరిగేషన్ ఈఈ కార్యాలయ సమీపంలో నిర్మించేందుకు పిల్లర్లు తీశారు. అయితే నిధుల విడుదలలో జాప్యంతో పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి.


