మెదక్ కలెక్టరేట్: ప్రజాపాలన దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో గురువారం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ వేడుకలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
● బీజేపీ అధికారంలోకి వస్తే అధికారికంగా విమోచనం
● ఎంపీ రఘునందన్‌రావు
మెదక్‌జోన్: అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, అధికారంలోకి వచ్చాక ఎంఐఎంకు భయపడి మాటమార్చాయని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. బుధవారం ఆయన మెదక్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. డబుల్ ఇంజన్ సర్కార్ (బీజేపీ) అధికారంలోకి వస్తే రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామన్నారు. బీజేపీ సర్పంచ్‌లుగా గెలుపొందిన గ్రామాల్లో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా నెలరోజుల పాటు నిర్వహించాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు రంజిత్‌రెడ్డి, సురేష్, శ్రీనివాస్, రాగి రాములు, ప్రసాద్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
హవేళిఘణాపూర్(మెదక్): ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండలంలోని కోంటూర్ చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ పట్టణంతో పాటు ఆయా గ్రామాల నుంచి భారీ విగ్రహాలు నిమజ్జనం చేసే అవకాశం ఉన్నందున, వాహనాల పార్కింగ్, క్రేన్, గజ ఈతగాళ్ల ఏర్పాట్లపై ఆరా తీశారు. మెదక్ పట్టణం నుంచి తరలివచ్చే వాహనాలకు రోడ్డుకు అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించి ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేలా జేసీబీ, క్రేన్లు, అగ్నిమాపక వాహనాలు, ప్రథమ చికిత్స కేంద్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. ఎస్పీ వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, సీఐలు కృష్ణమూర్తి, సందీప్‌రెడ్డి ఉన్నారు.
కేతకీ హుండీ ఆదాయం రూ.41.63 లక్షలు
ఝరాసంగం(జహీరాబాద్): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర ఆలయ హుండీ ఆదా యం రూ. 41,63,605 లక్షలు వచ్చింది. 39 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం వారు సమర్పించిన హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ముందుగా గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, నగదు లెక్కింపు ప్రారంభించారు. ఆలయ ఈఓ శివ రుద్రప్ప తదితరులు పాల్గొన్నారు. అలాగే శ్రావణమాసం ముగింపు పూజలు చేశారు.


