ధాన్యం సేకరణకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణకు సన్నద్ధం

Sep 17 2026 8:29 AM | Updated on Sep 17 2026 8:29 AM

జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం వరి పొట్టదశలో ఉండగా, నెలాఖరుకు కోతకు రానున్నాయి. జిల్లా యంత్రాంగం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా వచ్చేనెల 1 నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు ఈనెల 8న అదనపు కలెక్టర్‌ నగేశ్‌ వివిధ శాఖల అధికారులతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. – మెదక్‌ కలెక్టరేట్‌

ఏడాది వానాకాలం సీజన్‌లో 2.93 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. సుమారు 4.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు తెచ్చిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాంల నిర్మాణాల కోసం స్థలాలను పరిశీలించనున్నారు. స్థల సేకరణకు ఆర్డీఓ, తహసీల్దార్లు సన్నద్ధమయ్యారు. జిల్లాలో ధాన్యం దిగుబడికి అనుగుణంగా నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వ స్థలాలు, వ్యవసాయ మార్కెట్‌ యార్డులు తదితర ప్రాంతాల్లో స్థలాలను పరిశీలన చేయనున్నారు. మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు, రైతులకు అందుబాటులో ఉండే విధంగా గోదాంల నిర్మాణానికి అవసరమైన స్థలాల ఎంపిక చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈమేరకు అక్టోబర్‌ మొదటి వారంలో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించేలా అవగాహన కల్పించనున్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, ధాన్యం నాణ్యత పరీక్షించే పరికరాలు ముందుగానే సిద్ధం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

పారదర్శకంగా.. వేగంగా

రబీలో ఒకేసారి కేంద్రాలకు ధాన్యం పెద్ద ఎత్తున తరలిరావడం, హమాలీల కొరతతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. రైతులంతా ఒకేసారి రావడంతో అధికారులు సైతం అవస్థలు పడ్డారు. అయితే ఖరీఫ్‌లో పారదర్శకంగా, వేగవంతంగా ధాన్యం కొనుగోలు జరిగేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు అదనపు కలెక్టర్‌ దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించనున్నారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందించనున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా మొత్తం 518 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఐకేపీ 174, పీఏసీఎస్‌లు 300, డీసీఎంఎస్‌ 12, ఎఫ్‌టీఓ 32 కేంద్రాలు ఉన్నాయి.

వచ్చేనెల 1 నుంచి ఖరీఫ్‌ కొనుగోళ్లు

జిల్లావ్యాప్తంగా 518 సెంటర్ల ఏర్పాటు

గోదాంల నిర్మాణాలకు అధికారుల స్థల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement