కేంద్రాల్లో వసతుల్లేవు | - | Sakshi
Sakshi News home page

కేంద్రాల్లో వసతుల్లేవు

Apr 30 2026 8:55 AM | Updated on Apr 30 2026 8:55 AM

● మండుటెండల్లో అన్నదాతల అవస్థలు ● రోజుల తరబడి ఎదురుచూపులు ● జిల్లాలో 525 కొనుగోలు కేంద్రాలు

తూకాలు ప్రారంభం కావు
● మండుటెండల్లో అన్నదాతల అవస్థలు ● రోజుల తరబడి ఎదురుచూపులు ● జిల్లాలో 525 కొనుగోలు కేంద్రాలు

మెదక్‌ అర్బన్‌: నిలువ నీడ, తాగు నీరు లేక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు విలవిలలాడుతున్నారు. కమీషన్‌ కాసుల వేటలో నిర్వాహకులు అన్నదాతల సమస్యలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా చోట్ల కేంద్రాలు ప్రారంభించిన్పటికీ, హమాలీలు లేక 405 కేంద్రాల్లో తూకాలు ప్రారంభం కాలేదు. కేవలం 120 కేంద్రాల్లో మాత్రమే ధాన్యం సేకరిస్తున్నారు. గత 20 రోజులుగా రైతులు ధాన్యం ఆరబోసి.. రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది.

కమీషన్‌ ఖర్చు చేయొచ్చు

యాసంగికి సంబంధించి జిల్లాలో 4.45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం జిల్లాలో 525 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. వరి కోతలు ప్రారంభించి 20 రోజులు కావొస్తున్నా, హమాలీల కొరతతో ఇప్పటివరకు కేవలం 120 కేంద్రాల్లో తూకాలు ప్రారంభం అయ్యాయి. కొనుగోలు కేంద్రాల యాజమాన్యాలకు క్వింటాల్‌కు రూ.32 చొప్పున కమీషన్‌ చెల్లిస్తారు. ఇందులో 40 శాతం కేంద్రం నిర్వాహణకు వినియోగించుకోవచ్చు. రైతులకు తాగు నీరు, నీడ కోసం టెంట్లు తదితర సౌకర్యాలు కల్పించాలి. కానీ చాలా చోట్ల ఇవేవి కనిపించడం లేదు. మండుటెండల్లో రైతన్నలు పడరాని కష్టాలు పడుతున్నారు. పాపన్నపేటలో 20 రోజులుగా రైతులు, కేంద్రం వద్ద తమ ధాన్యాన్ని ఆరబోసి, అక్కడే పడిగాపులు కాస్తున్నారు. 40 శాతం కమీషన్‌లో నిర్వాహకుల దినసరి వేతనం, రికార్డుల కొనుగోలు, ఇతర ఖర్చులు మిగిలించుకుంటున్నారు. కానీ రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. అలాగే సన్న వడ్లకు డిమాండ్‌ ఉండటంతో నిర్వాహకులు తమకు కమీషన్లు ఇచ్చే మిల్లర్లకే వాటిని పంపుతున్నారు. కాగా కమీషన్ల ద్వారా సుమారు రూ.12.10 కోట్ల ఆదాయం వస్తుంది.

తాగడానికి నీళ్లు లేవు

పొలం కోసి దాదాపు 20 రోజులు అవుతుంది. అప్పటి నుంచి ప్రతి రోజు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్న. మ ండుటెండల్లో చెమటలు గక్కుతున్నాం. కనీసం తాగేందుకు సుక్క నీరు లేదు. పగలంతా ఎండ బోయడం, వాన మొగులు కాగానే కుప్ప చేయడంతోనే సరిపోతుంది.

– ఆకుల సాయిలు, రైతు, పాపన్నపేట

సౌకర్యాలు కల్పిస్తాం

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కల్పిస్తాం. ఇప్పుడిప్పుడే కేంద్రాలు ప్రారంభం అవుతున్నాయి. వచ్చే కమీషన్‌లో 40 శాతం వరకు నిర్వహణకు ఖర్చు చే యొచ్చు. అవసరమైతే రైతుల కోసం ఎక్కువ కూడా ఖర్చు చేస్తాం.

– శ్రీనివాస్‌, డీఆర్‌డీఓ

Advertisement
 
Advertisement
Advertisement