● ఇంత జరిగినా ముందుకు సాగని దర్యాప్తు ● రెవెన్యూలో సూత్రధారులు ఎవరు? ● విచారణ వేగవంతం చేయాలని బాధితుల డిమాండ్
అల్లాదుర్గం(మెదక్): భూభారతి చట్టం అపహాస్యం అయింది. అధికారులు రాసిందే చట్టం, చేసిందే పట్టాగా మారింది. అధికారులు, సిబ్బంది చేయి తడిపితే చాలు చట్టం ఉండదు, నిబంధనలు అడ్డురావు. రూ. కోట్ల విలువ గల భూములు అక్రమార్కుల సొంతం అవుతున్నాయి. అల్లాదుర్గం తహసీల్దార్ కార్యాలయం అక్రమ పట్టా, పౌతిలకు నిలయంగా మారింది. ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో తమకు న్యాయం జరుగుతుందని బాధితులు ఆశిస్తున్నారు. అయితే జిల్లా అధికారుల అండదండలు అక్రమార్కులకు ఉండటంతో విచారణను తప్పుదారి పట్టిస్తారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగాఇప్పటికీ పలువురు పౌతి కోసం, తప్పుల రికార్డులు సరి చేసుకునేందుకు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
భారీగా చేతులు మారిన డబ్బు
గడిపెద్దాపూర్‌లో నాలుగెకరాల భూమిని ఎలాంటి రికార్డులు, అధారాలు లేకున్నా రెవెన్యూ అధికారులు మరొకరి పేరున అక్రమంగా పట్టా చేశారు. ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది, అల్లాదుర్గం రెవెన్యూ అధికారులు పెద్దఎత్తున డబ్బులకు ఆశ పడి భూములను ఇతరులకు అంటగట్టారు. ఇందులో జిల్లాస్థాయి అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే అల్లాదుర్గం, కాయిదంపల్లి, అప్పాజీపల్లి గ్రామాల్లో అక్రమంగా ఇతరుల పేరిట పౌతి చేయడం కలకలం రేపింది. అల్లాదుర్గానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు అధికారులతో మిలాఖత్ అయి పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. బతికున్న వ్యక్తి మర ణించినట్లు రికార్డులు సృష్టించి భూములను మాయం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో సాదాబైనామా, పౌతి మార్పిడిలో పెద్దఎత్తున అక్ర మాలు జరిగాయి. రూ. లక్షలు చేతులు మారడంతో భూ అక్రమాలు చోటు చేసుకున్నాయి. కలెక్టర్ వీటిపై పూర్తిస్థాయి విచారణ చేపడితే అక్రమాలు వెలుగులోకి వస్తాయని బాధితులు చెబుతున్నారు.


