● జిల్లావ్యాప్తంగా 518 కేంద్రాల ఏర్పాటు
● అదనపు కలెక్టర్ నగేశ్
మెదక్ కలెక్టరేట్: ఈనెల 10 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మొత్తం 518 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు సామగ్రిని ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గన్నీ బ్యాగులు, తూకం, టార్పాలిన్ కవర్లు, మొదలైన సామగ్రి అందుబాటులో ఉండాలన్నారు. రైస్ మిల్లుల యజమానులు హమాలీలను, రవాణా వాహనాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అన్‌లోడింగ్ ప్రక్రియ త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రైస్‌మిల్లర్లకు సూచించారు. యాసంగి సీజన్ సీఎంఆర్‌ను త్వరగా పూర్తి చేయాలన్నారు. తూనికలు, కొలతల అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో ధాన్యం తూకం కొలతలను తనిఖీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి నిత్యానంద్, డీఎం జగదీష్, జిల్లా కోపరేటివ్ అధికారి కరుణాకర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


