ఈజీఎస్ మెటీరియల్‌నిధులు సద్వినియోగం
● 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.45 కోట్లు మంజూరు
● కొనసాగుతున్న నిర్మాణ పనులు
మెదక్‌జోన్: ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంలో భాగంగా ఏటా ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు మంజూరైన మెటీరియల్ పనులను సంవత్సరం ముగిసే ముందు హడావుడిగా ప్రారంభించి నిధులను సద్వినియోగం చేస్తున్నారు. కానీ ఏడాది పాటు సమయం ఉన్నా, వాటిని ఏ రకమైన అభివృద్ధికి ఉపయోగించాలని ఆలోచించకుండా, గడువు ముంచుకు రాగానే పనులను ప్రారంభించి నిధులు నిలిచినట్టే అన్న విధంగా చేస్తున్నారు. జిల్లా అభివృద్ధికి ఏటా కేంద్రం నుంచి ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద మెటీరియల్ పనుల కోసం కొన్ని నిధులు ఇస్తోంది. వాటిని మార్చి 31 వరకు పనులు ప్రారంభించాలి. లేనిచో అవి రద్దవుతాయి. అందులో భాగంగానే ఈ ఏడాది జిల్లా అభివృద్ధి కోసం రూ. 45 కోట్లు మంజూరయ్యాయి. వీటిని ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది మాసాల్లో కేవలం రూ.11 కోట్లకు సంబంధించిన పనులు మాత్రమే ప్రారంభించారు. గడువు ముంచుకు రాగానే జనవరి నుంచి మార్చి వరకు మూడు మాసాల్లో మిగిలిన రూ. 33 కోట్లకు సంబంధించిన పనులను ప్రారంభించారు.
రూ.45 కోట్లు.. 496 పనులు
ఉపాధి పథకంలో ఈ ఏడాది 496 మెటీరియల్ పనులకు గానూ రూ. 45 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో 106 పనులు పాఠశాలల ప్రహరీలు, 130 మహిళా భవనాలు, 17 అంగన్‌వాడీ, 41 పంచాయతీ, 202 సీసీ రోడ్ల నిర్మాణాలతో మొత్తం 496 పనుల కోసం రూ.45 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో పంచాయతీ భవనాల్లో ఇప్పటివరకు 17 పూర్తి కాగా, ఇంకా 24 వివిధ దశల నిర్మాణాల్లో ఉన్నాయి. కాగా జిల్లావ్యాప్తంగా స్వయం సహాయక గ్రూపులు 13,257 ఉండగా, వాటిలో 1.37 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. వీరికి అనేక గ్రామాల్లో కనీసం సమావేశాలు నిర్వహించుకునేందుకు సొంత భవనాలు లేవు. కాగా 130 గ్రామాల్లో మహిళా భవనాలు మంజూరు కాగా, నిర్మాణాలు సాగుతున్నాయి. అలాగే జిల్లాలో 2014కు ముందు 420 గ్రామాలు మాత్రమే ఉండగా, బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక 500 గిరిజన తండాలు, మధిర గ్రామాలను కలిపి కొత్తగా 72 పంచాయతీలు ఏర్పాటు చేసింది. కాగా ఈజీఎస్‌లో 41 జీపీ భవనాలకు నిధులు మంజూరు కాగా, నిర్మాణ పనులు సాగుతున్నాయి.
ముమ్మరంగా పనులు
ఈజీఎస్ పథకంలో జిల్లాకు రూ.45 కోట్లు మంజూరు కాగా, వివిధ శాఖల పరిధిలో పనులను గుర్తించి ప్రారంభించాం. మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేశాం. సకాలంలో పనులు పూర్తి చేసి ఆయాశాఖల అధికారులకు అప్పగిస్తాం.
– నర్సింలు, మెదక్ ఈఈ పీఆర్


