కొమురవెల్లి.. ప్రణమిల్లి..
కొమురవెల్లి(సిద్దిపేట): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పరమశివుడి ప్రతి రూపమైన మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. పూనకాలతో ఊగిపోయిన భక్తులు, జయజయధ్వానాల మధ్య ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఒక్క పొద్దులతో జాగరణ చేసేందుకు భక్తులు తరలి వచ్చారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి రోజు రాత్రి ఒగ్గుపూజారులు నిర్వహించే పెద్దపట్నం కార్యక్రమాన్ని చూసేందుకు వేలాది మంది తరలి వచ్చారు. రాజగోపురం నుంచి ప్రధాన రహదారి, గంగరేణు చెట్టు వద్ద సందడి నెలకొంది. స్వామి వారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. అనంతరం కొండ పైన వెలసిన రేణుకాఎల్లమ్మను దర్శించుకునేందుకు నెత్తిన బోనాలతో వెళ్లారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో మహాశివరాత్రిరోజున ఒగ్గు పూజారులచే నిర్వహించే పెద్ద పట్నంకు ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తిచేశారు.
స్వామివారి రాజగోపురం ఎదుట
భక్తుల రద్దీ
కొమురవెల్లి.. ప్రణమిల్లి..


