అదిగో పులి..!
● వాట్సాప్‌లో వైరల్
● ఫేక్ అని తేల్చిన అటవీ అధికారులు
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని ఎస్. కొండపూర్ అటవీ ప్రాంతంలో మెదక్– చేగుంట రోడ్డు నుంచి టీ.మాందాపూర్ వైపు పులి వెళ్లిందని వాట్సాప్‌లో వైరల్ అయింది. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంటకు తాము రోడ్డు దాటుతుండగా చూశామని వాయిస్ రికార్డుతో పాటు పులి ఫొటో వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయందోళనకు గురయ్యారు. ఇదే విషయమై రామాయంపేట రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ స్పందించారు. ఈ ప్రాంతంలో పులి కదలికలు లేవని చెప్పారు. వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఫొటో నిర్మల్ జిల్లాలో నాలుగు నెలల క్రితం తీసిందన్నారు. కాగా టీ.మాందాపూర్ సమీపంలోని గజగట్లపల్లి అటవీ ప్రాంతంలో చిరుత అడుగులను వన్యప్రాణుల లెక్కింపు సమయంలో అటవీశాఖ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.


