కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ
● బీఆర్‌ఎస్‌లోకి పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు
● మున్సిపల్ ఎన్నికల వేళ షాక్
● జిల్లాలో రసవత్తరంగా రాజకీయాలు
రామాయంపేట(మెదక్): జిల్లాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 30 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న పీసీసీ కార్యదర్శి, సీనియర్ రాష్ట్ర నాయకుడు సుప్రభాతరావు పార్టీని వీడారు. మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో తన కూతురును చైర్‌పర్సన్‌గా చేయాలని భావించారు. ఐదో వార్డు నుంచి టికెట్ కోసం ప్రయత్నించినా పార్టీ అంగీకరించకపోవడంతో వేచి చూశారు. చివరకు తన కూతురుతో నామినేషన్ వేయించగా, బీఫాం విషయమై పార్టీ నాన్చుడు ధోరణి అవలంభించింది. చివరి రోజు వరకు వేచి చూసిన ఆయన శుక్రవారం తన అనుచరులతో కలిసి హైదరాబాద్ తరలివెళ్లారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ బలోపేతానికి కొన్నేళ్లుగా కృషి చేసిన సుప్రభాతరావు పార్టీని వీడటంతో కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర
జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సుప్రభాతరావు కాంగ్రెస్‌ను వీడటం సంచలనంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి రోహిత్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. నాలుగైదు పర్యాయాలు ఎమ్మెల్యే టికెట్ కోసం, నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నించినా సఫలం కాలేదు. చివరకు మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ కూడా దక్కకపోవడంతో తీవ్ర నైరాశ్యం చెందారు. మున్సిపల్ ఎన్నికల్లో తన కూతురును టికెట్ ఇవ్వకపోవడాన్ని అవమానంగా భావించిన ఆయన పలుమార్లు పార్టీ పెద్దల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు.
హరీశ్‌రావు మంత్రాంగం
జిల్లాలోని మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఏచిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతు న్నారు. ఇందులో భాగంగా మెదక్‌లో సీనియర్ నాయకుడు సురేందర్‌గౌడ్‌ను ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అసంతృప్తితో ఉన్న సుప్రభాతరావు విషయంలోనూ ఆచితూచి వ్యవహరించి సక్సెస్ అయ్యారు. త్వరలో మరికొందరు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.


