ఆఖరి రోజు అట్టహాసంగా
మెదక్ మున్సిపాలిటీ వద్ద అభ్యర్థుల మద్దతుదారులు
మెదక్ కలెక్టరేట్: నామినేషన్లకు శుక్రవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు వారి మద్దతుదారులతో పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో మెదక్ మున్సిపల్ కార్యాలయం కిక్కిరిసి పోయింది. టికెట్ పొందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సైతం అనుచరులతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. పట్టణమంతా బ్యాండు మేళాలు, టపాసుల మోతలు, నినాదాలతో హోరెత్తింది. రాందాస్ చౌరస్తా, పాత బస్టాండ్, ము న్సిపల్ కార్యాలయ వద్ద సందడి నెలకొంది. పట్టణ సీఐ మహేశ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి మూడోరోజు అభ్యర్థుల నుంచి పలు రకాల పన్నులు స్వీకరించారు. అనంతరం నోడ్యూ సర్టిఫికెట్లు అందజేశారు. చివరి రోజు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, వారికి మద్దతుగా అత్యధికంగా అన్ని వార్డుల నుంచి మహిళలే తరలివచ్చారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


