వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ రాహుల్‌రాజ్
నిజాంపేట(మెదక్): వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి మాట్లాడారు. వార్షిక పరీక్షల కోసం విద్యార్థులను సమర్థవంతంగా సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉత్తీర్ణత శాతం పెంచే లక్ష్యంతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రత్యేక తరగతులతో మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. గణితం, సై్‌న్స్, ఇంగ్లీష్ వంటి ముఖ్యమైన సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పెట్టాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి మంచి మార్కులు సాధించేలా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చలిమెటి నరేందర్, ఉప సర్పంచ్ గెరిగంటి బాబు, ఎంపీడీఒ రాజిరెడ్డి, ఎంపీఓ వెంకట నర్సింహారెడ్డి, కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రహదారుల పనులు త్వరితగతిన పూర్తి చేసి, రోడ్డు ప్రమాదాలను నివారించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రహదారులు, పోలీస్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారులపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చాలన్నారు. మత్తు పదార్థాలపై నిఘా పెంచి నిరోధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


