తిరుగుపోటు
● కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు రెబల్స్ తలనొప్పి
● పోటీలో కొనసాగితే తప్పని నష్టం
● నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిళ్లు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు రెబల్స్ తలనొప్పిగా తయారయ్యారు. ఆయా పార్టీల టికెట్లు ఆశించి ముందస్తుగానే నామినేషన్లు వేసిన నాయకులకు అభ్యర్థిత్వాలు దక్కకపోవడంతో స్వతంత్రులుగా కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. రెబల్స్ బరిలో ఉంటే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో రెబల్స్‌ను పోటీ నుంచి తప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
టికెట్ల కోసం పోటా పోటీ
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను రెబల్స్ సమస్య వేధిస్తోంది. కాంగ్రెస్ టికెట్ల కోసం చాలామంది నేతలు పోటీ పడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చాలామంది బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఇలా కొత్తగా పార్టీలో చేరిన వారు..చాలా ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నవారు ఈ టికెట్లు ఆశించారు. దీంతో ఈ పార్టీ టికెట్ల కోసం పోటాపోటీ నెలకొంది. ఈ టికెట్లు దక్కని నాయకులు స్వతంత్రులుగా పోటీలో కొనసాగేందుకు సై అంటున్నారు. ఇక తక్షణం నామినేషన్లు ఉపసంహరించుకోవాలని రెబల్స్‌పై ఆయా పార్టీల నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలు రంగంలోకి దిగి రెబల్స్‌ను బుజ్జగిస్తున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటే పార్టీ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని, రానున్న రోజుల్లో మరేదైనా పదవి ఇస్తామని.. వెంటనే నామినేషన్ ఉపసంహరించుకుని పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని చెబుతున్నారు. అయినప్పటికీ మాటవినని పక్షంలో పార్టీపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇంకా అందని బీఫారాలు
పార్టీలు అభ్యర్థిత్వాలు ప్రకటించినప్పటికీ ఇంకా బీఫారాలు పంపిణీ చేయడం లేదు. బీఫారాలు ఇచ్చేందుకు రెండు రోజులు గడువు ఉండటంతో టికెట్లపై అభ్యర్థుల్లో సస్పెన్స్ వీడటం లేదు. అభ్యర్థిత్వాలు ప్రకటించినప్పటికీ కొన్ని వార్డుల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలున్నాయని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.


