ఇసుక దొరకక.. ఇళ్లు కట్టలేక!
● మెదక్‌లో ప్రారంభం కాని శాండ్‌బజార్
● ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు
మెదక్ నియోజకవర్గంలో శాండ్‌బజార్ ఏర్పాటు చేసి లబ్ధిదారులకు తక్కువ ధరకు ఇసుక ఇస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు పదేపదే చెబుతున్నారు. కానీ కేవలం అది ప్రకటనలకే పరిమితం అయింది. నర్సాపూర్ నుంచి ఇసుకను నియోజకవర్గంలోని మారుమూల గ్రామానికి తీసుకురావాలంటే 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం అవుతుంది. ఒక్క ట్రాక్టర్ కిరాయి ఆ దూరానికి రూ. 8 వేల పైచిలుకు ఉంటుంది. శాండ్‌బజార్‌లో టన్ను ఇసుకకు రూ. 1,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క ట్రాక్టర్‌లో 4 టన్నుల ఇసుక మాత్రమే వస్తుండగా, రూ. 12,800 ఖర్చు అవుతుంది. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి 40 టన్నుల ఇసుక అవసరం కాగా, ప్రభుత్వం ఇచ్చే రూ. 5 లక్షల్లో ఇసుకకే రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ పరిధిలో వారం క్రితం కరీంనగర్ నుంచి కొంత ఇసుకను తెచ్చి నిల్వ చేశారు. ఎప్పుడు ప్రారంభిస్తారని లబ్ధిదారులు అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందని ఓ అధికారి అంటుంటే, మరో అధికారి ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు సమయం ఇవ్వటం లేదని చెబుతున్నారు. ఇప్పటికై నా ఇసుకను సకాలంలో అందిస్తే ఇళ్ల నిర్మాణాలు చేపడతామని పేర్కొంటున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత తీవ్రంగా వేధిస్తోంది. అధికారులు ఆదిశగా చర్యలు చేపట్టకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో 9,209 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో ఇప్పటివరకు 4,327 మాత్రమే ప్రారంభించారు. మిగితా 4,882 ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభించలేదు. ఇందుకు ప్రధాన కారణం ఇసుక అందుబాటులో లేకపోవటమేనని తెలుస్తోంది.
– మెదక్‌జోన్
జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉండగా, రెండుచోట్ల శాండ్‌బజార్లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. కానీ ఒక్క నర్సాపూర్‌లో మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో ఆ నియోజకవర్గానికి సమీపంలో ఉన్న మండలాల లబ్ధిదారులు మాత్రమే ఇసుక కొనుగోలు చేస్తున్నారు. మిగితా వారు అవస్థలు పడుతున్నారు. కాగా నిర్మాణాలు ప్రారంభించకుంటే మంజూరు చేసిన ఇళ్లు రద్దు చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ప్రకటనలకే పరిమితం


