వసూల్ రాజాలు
పైకం లేనిదే కదలని ఫైళ్లు
ఒక్కో సేవకు.. ఒక్కో రేటు
రోజుకు రూ. వేలల్లో ఆదాయం
రోడ్ కింగ్‌లు..
ఆర్టీఏలో అవినీతి చీడ!
మెదక్ ఆర్టీఏ కార్యాలయం
మెదక్ ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుంది. రోడ్‌కింగ్‌లుగా చెలామణి అవుతున్న బాస్‌లు.. వసూల్ రాజాలుగా మారారు. ఒక్కో సేవకు, ఒక్కో రేటు నిర్ణయించి వాటా లేసి పంచుకుంటున్నారు. కార్యాలయ పరిధిలో పని చేసే ఇద్దరు ఏజెంట్లు బ్రోకర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా అధికారులకు అందజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే ఈ అవినీతి దందా మరకలు ప్రత్యక్షంగా తమకు అంటకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది.
– మెదక్ అర్బన్
జిల్లాలోని 21 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల వాహనదారులకు సేవలందించేందుకు మెదక్ పట్టణంలో ఆర్టీఏ కార్యాలయం ఉంది. సామాన్యుడి జీవితంలో వాహనాలు భాగం కావడంతో ప్రతి రోజు కార్యాలయం కిటకిటలాడుతోంది. వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, యాజమాన్య మార్పిడి తదితర సేవలకు సంబంధిత రుజుపత్రాలతో చలాన్లు కట్టి దరఖాస్తు చేస్తే, వాటి ని పరిశీలించి సేవలు అందించాలి. కానీ ‘శంఖులో పోస్తేనే తీర్థం అన్నట్లు.. బ్రోకర్ల ద్వారా వస్తే నే’ పని చేస్తున్నారు. లేకుంటే ఏదో ఒక పేపర్ లేదంటూ తిరస్కరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో చేసేది లేక వినియోగదారులు బ్రోకర్లను సంప్రదిస్తున్నారు. వారు కమీషన్లు వసూలు చేసి, కోడ్ నంబర్‌తో దరఖాస్తును పంపిస్తున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని జరిగిపోతుంది.
వారి రూటే సప‘రేటు’
ఆర్టీఏ కార్యాలయంలో ఒక్కో సేవకు ఒక్కో రేటు నిర్ణయించి వాహనదారులను నిలువు దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వివిధ రకాల వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ కోసం అదనంగా రూ. 550, నుంచి రూ. 1,200 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. లైసెన్స్ రెన్యువల్ రూ. 300, ఎక్స్‌పైరీ లెసెన్స్ రూ. 800 వరకు అధికారులకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ వాహనాల రిజిస్ట్రేషన్లకు రూ. 350 నుంచి రూ. 6 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. వాహనాల ఫిట్‌నెస్‌కు ఆటోకు రూ. 600, ట్రాక్టర్, ట్రాలీ రూ. 1,200, బస్ కెపాసిటీని బట్టి రూ. 5 వేల వరకు, హెవీ మోటర్ వెహికిల్, జేసీబీ, క్రేన్, హార్వెస్టర్ రూ. 3 వేల వరకు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈవిషయమై ఏటీఓను వివరణ కోరడానికి పలుమార్లు సంప్రదించగా, అందుబాటులోకి రాలేదు. ఏఓను వివరణ కోరగా ఈ విషయంలో ఏటీఓను సంప్రదించాల్సిందిగా సూచించారు.
వసూల్ రాజాలు


