ఎన్నికల నియమావళి పక్కాగా అమలు
కలెక్టర్ రాహుల్‌రాజ్
రేగోడ్(మెదక్)/అల్లాదుర్గం/టేక్మాల్/పెద్దశంకరంపేట: ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. గురువారం రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్, పెద్దశంకరంపేటలో నామినేషన్ల ప్రక్రియ ను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో 160 సర్పంచ్, 1,402 వార్డు స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని, నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, పై అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమాదేవి, సిబ్బంది ఉన్నారు.
అందుబాటులో ‘టీ– పోల్’
మెదక్ కలెక్టరేట్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం టీ–పోల్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని ఓటర్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. గురువారం నుంచి యాప్ ప్రజలకు అందుబాటులో ఉంది. ఇందులో ప్రధానంగా పౌరులు తమ పోలింగ్‌స్టేషన్ వివరాలు తెలుసుకోవడంతో పాటు ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్నికల కమీషన్ తెలిపింది. దీంతో పాటు యాప్ ద్వారా ఫిర్యాదులు కూడా చేయడంతో పాటు ట్రాక్ చేయవచ్చని పేర్కొంది.
ఎన్నికల నియమావళి పక్కాగా అమలు


