వడ్లు ఎక్కువ..మిల్లులు తక్కువ | - | Sakshi
Sakshi News home page

వడ్లు ఎక్కువ..మిల్లులు తక్కువ

Nov 4 2025 8:18 AM | Updated on Nov 4 2025 8:18 AM

వడ్లు ఎక్కువ..మిల్లులు తక్కువ

వడ్లు ఎక్కువ..మిల్లులు తక్కువ

4.20 లక్షల మెట్రిక్‌ టన్నులు టార్గెట్‌

జిల్లాలో 112 ఉంటే 45 మిల్లులకే అనుమతి ధాన్యం సేకరణపై ప్రభావం ఇప్పటివరకు కొన్నది 26,400 మెట్రిక్‌ టన్నులే..

సీఎంఆర్‌ ఇవ్వని మిల్లులకు ధాన్యం కేటాయించని అధికారులు

జిల్లాలో ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోంది. ఒక్కోరైతు 15 నుంచి 20 రోజుల పాటు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. తూకం అయినప్పటికీ మిల్లులకు వెళ్లిన లారీలు త్వరగా అన్‌లోడ్‌ కావటం లేదు. ఒకవైపు అకాలవర్షాలు వెంటాడుతుండటంతో ధాన్యం తడిసి ముద్దవుతోంది. వడ్లను మళ్లీ ఆరబెట్టడం రైతులకు భారంగా మారింది. అయితే దీనంతటికి కారణం తక్కువ మిల్లులకు సీఎంఆర్‌ ఇవ్వటమేనని

తెలిసింది. – మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా 112 రైస్‌మిల్లులు ఉండగా, ఈ ఖరీఫ్‌లో కేవలం 45 మిల్లులకు మాత్రమే కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కోసం కేటాయించారు. 15 రైస్‌ మిల్లులకు సంబంధించి రూ. 280 కోట్లు విలువ చేసే బియ్యాన్ని రైస్‌ మిల్లర్స్‌ ఎగ్గొట్టటంతో వారిపై కేసులు నమోదు చేసి బ్లాక్‌లిస్టులో పెట్టారు. రికవరీ కోసం ఆర్‌ఆర్‌యాక్టు ప్రయోగించారు. మరో 40 రైస్‌మిల్లర్స్‌ గత 2024 ఖరీఫ్‌ ధాన్యానికి సంబంధించి 15 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సివిల్‌ సప్లైకి ఇవ్వాల్సి ఉంది. బ్యాలెన్స్‌ బియ్యం ఇసే్‌త్‌ తప్ప వారికి ధాన్యం అలాట్‌ చేసే ప్రసక్తి లేదు. మరో 12 మిల్లర్స్‌ గతేడాది ఇచ్చిన సీఎంఆర్‌ను తిరిగి ఇచ్చినప్పటికీ, ఆలస్యంగా ఇచ్చారనే నెపంతో వారికి సైతం ధాన్యం కేటాయించలేదు. కాగా వారు సోమవారం కలెక్టర్‌ను కలిసి తాము సకాలంలో ఇచ్చినప్పటికీ, అప్పటి అధికారులు తప్పుడు ఆరోపణలు చేశారని విన్నవించారు. తమకు ధాన్యం కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడి ధాన్యం కేటాయింపు చేస్తానని కలెక్టర్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది.

జిల్లాలో 3.5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, అందుకు సంబంధించి 4.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధి కారులు అంచనా వేశారు. ఇందుకోసం 518 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నారు. కానీ కేవలం 45 మిల్లర్లకే ధాన్యం కేటాయించటంతో వాటిలో ధాన్యం బస్తాలను నిల్వ చేసేందుకు స్థలం సరిపోవడం లేదు. దీంతో అన్‌లోడింగ్‌ త్వరగా కాకపోవటంతో కేంద్రాల్లో తూకం వేసిన బస్తాలను త్వరితగతిన తరలించలేకపోతున్నారు. దీంతో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు 26,400 మెట్రిక్‌ టన్నులు మాత్రమే సేకరించారు. ఇదేవిధంగా ధాన్యం సేకరణ సాగితే డిసెంబర్‌ చివరి వరకు కొనుగోళ్లు సాగే అవకాశం ఉందని తెలిసింది.

ఆలస్యంగా ఇచ్చారనే..

12 మంది రైస్‌ మిల్లర్స్‌కు కేటాయించిన ధాన్యాన్ని మరాడించి బియ్యం ఇచ్చారు. ఆలస్యంగా ఇచ్చారని గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు రికార్డులో పొందుపర్చటంతో వారికి ధాన్యం ఇవ్వలేకపోయాం. ఈవిషయంపై 12 మంది మిల్లర్లు కలెక్టర్‌ను కలిశారు. కమిషనర్‌తో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాకే తగు నిర్ణయం తీసుకుంటాం.

– జగదీశ్‌కుమార్‌, డీఎం, సివిల్‌ సప్లై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement