అవినీతిని ఉపేక్షించేది లేదు
● అధికారులతో కలెక్టర్ రాహుల్‌రాజ్ ● ప్రజావాణిలో వినతుల స్వీకరణ
మెదక్ కలెక్టరేట్: ఎట్టి పరిస్థితిల్లో అవినీతిని ఉపేక్షించేది లేదని, ఆ ఆలోచన ఉంటే వెంటనే విరమించుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల వద్ద నుంచి డబ్బులు తీసుకోవడం సరికాదన్నారు. అవినీతిని అంతమొందించకపోతే అది అందరిని ప్రభావితం చేస్తుందన్నారు. జిల్లాలోని అన్ని శాఖలపై ప్రత్యేక దృష్టి సారించానని, ఆరోపణలు ఎదుర్కొన్న వారిని ఉపేక్షించేది లేదన్నారు. అంతకుముందు ప్రజావాణిలో వినతులు స్వీకరించా రు. మొత్తం 77 అర్జీలు రాగా, భూభారతి 36, ఇందిరమ్మ ఇళ్లు 7, పెన్షన్లు 7, ఇతర సమస్యలపై 27 వినతులు వచ్చాయి. అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీసీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డీఆర్‌ఓ భుజంగరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం తనిఖీ
కౌడిపల్లి(నర్సాపూర్)/మెదక్ కలెక్టరేట్: కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలీన్లు, ప్యాడీ క్లీనర్లు, తేమ యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. సోమవారం సాయంత్రం మండలంలోని నాగ్సాన్‌పల్లిలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ధాన్యంలో తేమశాతం తనిఖీ చేశారు. ధాన్యం బస్తాలు డీసీఎంలో లోడింగ్ అవుతుండగా పరిశీలించారు. అలాగే పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈనెల 20 నాటికి లక్ష్యం పూర్తయ్యేలా చేప పిల్లల విడుదల పూర్తి చేయాలని సూచించారు. చేప పిల్లలు చెరువులకు చేరేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
