15 రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తాం
● వినియోగదారుల సదస్సుకు  విశేష స్పందన ● ఎస్‌ఈ నారాయణ నాయక్ 
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో సోమవారం నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సదస్సుకు విశేష స్పందన లభించిందని, సమస్యలన్నీ 15 రోజుల్లో పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ ఎస్‌ఈ నారాయణనాయక్ పేర్కొన్నారు. మెదక్ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 102 ఆర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. ఇందులో మెదక్ సబ్ డివిజన్ పరిధిలో 28, నర్సాపూర్‌లో 16, పాపన్నపేటలో 20, తూప్రాన్‌లో 23, రామాయంపేటలో 15 అర్జీలు వచ్చాని చెప్పారు. సదస్సులో వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీటిల్లో అత్యధికంగా ఇళ్లపై విద్యుత్ తీగలు ఉండటం, కేటగిరీల్లో మార్పులు, విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా ఉండటంతో పాటు తీగలను మార్చాలని, మీటర్ రీడింగ్ బిల్లులు తప్పుగా వస్తున్నాయని, మీటర్లు కాలిపోయాయని ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదులలో 15 అక్కడికక్కడే పరిష్కరించామన్నారు. కార్యక్రమంలో మెదక్ ఇన్‌చార్జి డీఈ శ్రీనివాస్ విజయ్, ఏడీఈ మోహన్ బాబు, ఎంఆర్‌టీ డీఈ సోమేశ్వరరావు, విజిలెన్స్ డీఈ శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ టౌన్ ఏఈ నవీన్, రూరల్ ఏఈ రాజ్‌కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
