విద్య, వైద్యానికి ప్రాధాన్యం
మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూం కాలనీలో వీఎస్‌టీ సంస్థ రూ.8 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో నిర్మిస్తున్న 60 గదుల పాఠశాల నిర్మాణం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కొల్లూరు ప్రభుత్వ డబుల్ బెడ్రూం కాలనీ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కాలనీ వాసులు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. కాలనీ అభివృద్ధికి ఒక పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సంక్రాంతి వరకు కాలనీలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంతో పాటు రెండు 108 అంబులెన్స్‌లు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాలనీలో పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటుకు ఆదేశించినట్లు వివరించారు. ఈనెల 10 నుంచి ఇళ్ల వద్దకే రేషన్ బియ్యం అందిస్తామని పేర్కొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
