మళ్లీ సాగునీటి సంఘాలు..!
ఈ దిశగా సర్కార్ అడుగులు
● జిల్లాలో 1,617 చెరువులు ● రైతులదే కీలక పాత్ర ● నాయకులకు రాజకీయ పదవులు
పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వం మరోసారి సాగునీటి సంఘాల ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభించింది. సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజకీయ నిరుద్యోగం కొంత మేర తగ్గించడంలో భాగంగా సాగునీటి సంఘాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వ ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2006లో ఈ పథకాన్ని ప్రారంభించారు. 2008 వరకు ఉమ్మడి రాష్ట్రంలో 10,748 సాగునీటి సంఘాలు ఏర్పాటయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో రధ్దు చేశారు. అప్పటి నుంచి సాగునీటి సంఘాల ఊసేలేదు.
జిల్లా వ్యాప్తంగా 1,617 చెరువులు, 105 చెక్‌డ్యాంలతో పాటు శాశ్వత నీటి వనరులు వనదుర్గ (ఘనాపూర్), కొంటూరు, రాయిన్‌చెరువు, మధ్యతరహా ప్రాజెక్టులు పోచారం, హల్దీలు ఉన్నాయి. ఆయా చెరువుల కింద 2,67,648 ఎకరాలలో వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఆయా చెరువుల సంరక్షణ ఇప్పటి వరకు నీటి పారుదల (ఇరిగేషన్)ను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
రైతులదే కీలక పాత్ర
సాగునీటి సంఘాల్లో రైతులదే కీలక పాత్ర పోషిస్తారు. కాల్వలు, తూములు, షెట్టర్ల మరమ్మతులు, నీటి వనరుల నిర్వహణ, నీటి వినియోగం, మరమ్మతుల వంటి సంరక్షణకు సాగునీటి సంఘాలు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రస్తుతం సాగునీటి సంఘాల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు సంఘాలుగా ఏర్పడి చెరువుల అభివృధ్ధి జరిగేందుకు ఎంతో దోహదపడుతుందని వారు భావిస్తున్నారు. ఈ సంఘాల ఏర్పాటు ద్వారా నాయకులు, రైతులకు ఉపయోగం జరగనుంది. దీనిపై ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.


