
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
భూ సేకరణ వేగవంతం చేయాలి
సంగారెడ్డి జోన్: జిల్లాలో ఏర్పాటు కానున్న నిమ్జ్, టీజీఐఐసీ కోసం భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి, జహీరాబాద్ డివిజన్లలో జరుగుతున్న టీజీఐఐసీ, నిమ్జ్ భూసేకరణ పనుల పురోగతిపై ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులు, టీజీఐఐసీ, నిమ్జ్ అధికారులతో కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ సమీక్షించారు. నిమ్జ్ ప్రాజెక్టు మొదటి దశ ఏర్పాటుకు ఇప్పటివరకు 1,501 ఎకరాల భూసేకరణ పూర్తి చేసినట్లు రెవెన్యూ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మిగిలిన భూమిని సైతం త్వరలోనే సేకరించి అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...భూసేకరణకు అవసరమైన నిధులు టీజీఐఐసీ తక్షణం చెల్లించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భూసేకరణకు నిధుల కొరత లేదని తెలిపారు. ఇప్పటివరకు టీజీఐఐసీ, నిమ్జ్ ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీల ప్రకారం పరిహారం అందించినట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, నిమ్జ్ ప్రత్యేకాధికారి విశాలాక్షి, సంగారెడ్డి, జహీరాబాద్ ఆర్డీఓలు, టీజీఐఐసీ ప్రతినిధులు, నిమ్జ్ ప్రతినిధులు పాల్గొన్నారు.