
పంట ఆరబోసేదెలా?
● టార్పాలిన్లు లేక ఇబ్బందులపాలవుతున్న రైతులు
● అద్దెకు తెచ్చుకుంటున్న రైతులపై అదనపు భారం
గతంలో మాదిరిగా ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్లు ఇవ్వకపోడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ సీజన్‌లో ఒక్కొక్కరిపై కనీసం రూ.రెండు వేల నుంచి మూడున్నర వేలవరకు భారం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రామాయంపేట(మెదక్): పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవడానికిగాను ప్రస్తుత పరిస్థితుల్లో టార్పాలిన్లు అత్యవసరం. గతంలో ప్రభుత్వం 50% రాయితీపై వాటిని సరఫరా చేసింది. గత నాలుగైదేళ్లుగా ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. టార్పాలిన్లు లేకపోవడంతో రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ ధాన్యం ఆరబోస్తున్న రైతులు ఇబ్బందులపాలవుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అద్దైపె టార్పాలిన్లు అందించే వారిని ఆశ్రయిస్తున్నారు. గత ప్రభుత్వ హాయాంలో రైతులకు 50% సబ్సిడీపై వ్యవసాయశాఖ ద్వారా టార్పాలిన్లు సరఫరా చేసింది. ఎనిమిది అడుగుల పొడవు, ఆరడుగుల వెడల్పు ఉన్న టార్పాలిన్ల అసలు ధర రూ.2,500 కాగా, రైతులకు రూ.1,250 కే అందజేసింది. రెండు, మూడేళ్లపాటు ఈ పథకం కొనసాగగా, పెద్ద సంఖ్యలో రైతులు వాటిని కొనుగోలు చేశారు. జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో టార్పాలిన్లను సబ్సిడీపై అందజేయగా, గత నాలుగేళ్ల క్రితం ఈ పథకం రద్దయింది.
రైతన్నలకు అదనపు ఖర్చు
ఆంధ్రప్రదేశ్‌నుంచి వచ్చిన వ్యాపారులు కొందరు జిల్లాలోని పెద్ద గ్రామాలు, పట్టణాల పరిధిలో టార్పాలిన్లు అద్దెకు ఇచ్చే దుకాణాలు ప్రారంభించారు. ఈ మేరకు జిల్లా పరిధిలో 80 వరకు తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకుని అద్దెకు ఇస్తున్నారు. రైతుల ఆధార్ కార్డులు తనఖా పెట్టుకుని టార్పాలిన్లు ఇస్తూ ఒక్కోదానికి రోజూ రూ.25 నుంచి రూ.30 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికిగాను సాధారణంగా ప్రతీ రైతుకు కనీసం ఆరు నుంచి పది టార్పాలిన్లు అవసరం అవుతుండగా, వాటిపై ప్రతీ రోజు రూ.300 వరకు భారం పడుతోంది. పంట నూర్పిడి చేయడం, ఆరబెట్టడం, సంచుల్లో నింపి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించడానికి రైతులకు కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన రైతులపై టార్పాలిన్ల అద్దె కోసం రూ.ఆరు వేల వరకు ఖర్చవుతుంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సబ్సిడీపై టార్పాలిన్లు అందజేయాలని రైతులు కోరుతున్నారు.