
నూనె గింజల ఉత్పత్తిని పెంచాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
రేగోడ్(మెదక్)/పాపన్నపేట(మెదక్): నూనె గింజల ఉత్పత్తులను పెంచాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన రేగోడ్‌లోని రైతువేదిక కార్యాలయంలో మంగళవారం నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ అమలుపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వ్యవసాయ అధికారి, రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. పొద్దుతిరుగుడు 93%, శనగ విత్తనాలు 50% రాయితీతో ఎంపిక చేసిన రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా అధిక దిగుబడి సాధించడమే కాకుండా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు. ప్రతీ రైతు ఈ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. నూనెగింజల ఉత్పత్తి ద్వారా స్థానిక సాధికారతను సాధించి దిగుమతులను తగ్గించుకోవచ్చని తెలిపారు. అనంతరం స్థానిక పశు వైద్యశాలను, పాపన్నపేట మండల పరిధిలోని పొడిచన్‌పల్లి ప్రాథమిక ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వాస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కిషన్, ఏడీఏ రాంప్రసాద్, ఏఓ జావీద్ తదితరులు పాల్గొన్నారు.
1,500 హెక్టార్లలో వేరుశనగ
ఆయా మండలాల్లో రైతు సంఘాల సహకారంతో సుమారు 1,500 హెక్టార్లలో వేరుశనగ సాగును ప్రోత్సహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్‌కుమార్ తెలిపారు. నాణ్యమైన విత్తనాల సరఫరా, ఉత్పాదకత పెంపునకు శిక్షణా కార్యక్రమాలు, విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతు పొలంబడులను నిర్వహించనున్నట్లు వివరించారు. అలాగే బిందు సేద్యం ఏర్పాటు కోసం ఉద్యానవన శాఖ సహకారం అవసరమని అన్నారు.
పంట అవశేషాలు తగుల బెట్టకండి:
వ్యవసాయ శాఖ అధికారి దేవకుమార్
పాపన్నపేట(మెదక్): వరి పంట అవశేషాలు తగుల బెట్టవద్దని జిల్లా వ్యవసాయ అధికారి దేవ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం పాపన్నపేట మండలం ఆరెపల్లిలో వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. తగులబెట్టడం వల్ల భూమిలో ఉన్న సేంద్రియ కర్బనం, భూమి భౌతికస్థితి దెబ్బతినడంతోపాటు కాలుష్యం కూడా పెరుగుతుందన్నారు.
సర్వేలో అందరూ పాల్గొనాలి
మెదక్ కలెక్టరేట్: తెలంగాణ రైజింగ్–2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ స్వాతంత్య్రానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్–2047’సిటిజన్ సర్వేను చేపట్టిందని పేర్కొన్నారు. ఈ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. గతవారం ప్రారంభించిన ఈ సర్వే ఈ నెల 25తో ముగుస్తుందని, https://www.telangana.gov.in/ telanganarisingను సందర్శించి సలహాలు, సూచనలు అందించాల్సింది కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.