
శతశాతం ఉత్తీర్ణత దిశగా..
పది విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్
పదవ తరగతిలో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా తయారు చేసిన అభ్యాసదీపికలు జిల్లాకు చేరుకోగా విద్యార్థులకు వాటిని పంపిణీ చేశారు. ఈ నెల 8నుంచి ప్రత్యేక తరగతులను సైతం ప్రారంభించారు. డిసెంబర్ నాటికి సిలబస్ పూర్తిచేసి జనవరి నుంచి రోజుకు 2 గంటలపాటు అదనంగా ప్రత్యేక తరగతులను నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.
మెదక్‌జోన్: మెదక్ జిల్లా వ్యాప్తంగా 146 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా మోడల్‌స్కూల్, సోషల్ వెల్ఫేర్, కేజీవీబీ, బీసీవెల్ఫేర్, ప్రైవేట్ తదితర ఉన్నత పాఠశాలతోపాటు మొత్తం 231 ఉన్నాయి. వాటిలో 10వ తరగతి విద్యార్థులు 11,721 చదువుకుంటున్నారు. ఇందులో బాలురు 5,923 కాగా బాలికలు 5,798 మంది విద్యార్థులున్నారు. శతశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ఈ నెల 8 నుంచి పాఠశాల ముగిసిన అనంతరం ఒక గంటపాటు అదనంగా ప్రత్యేక తరగతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కాగా డిసెంబర్ నాటికి సిలబస్‌ను పూర్తి చేసి జనవరి నుంచి ఉదయం, సాయంత్రం గంట చొప్పున రోజుకు 2 గంటల పాటు అదనంగా ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన అభ్యాసదీపికల్లో ప్రత్యేకంగా తయారు చేయించిన ప్రశ్నలపై ఉపాధ్యాయులు దృష్టి సారించి విద్యార్థులు ప్రతీ ప్రశ్నకు సమాధానం నేర్చుకునే విధంగా బోధిస్తున్నారు.
గతేడాది 12వ స్థానంలో!
గతేడాది పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రత్యేక చొరవ చూపించారు. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా పది విద్యార్థులకు అదనపు తరగతులు చెప్పించారు. కాగా, 2023లో రాష్ట్రంలో 18వ, స్థానంలో నిలిచిన మెదక్ జిల్లా గతేడాది 2024లో ఉత్తీర్ణతలో 12వ స్థానంలో నిలిచింది. అయితే ఈసారి వందశాతం ఉత్తీర్ణత సాధించి మొదటిస్థానంలో నిలిచేందుకు అధికారులు, ఉపాధ్యాయులు పకడ్బందీ కార్యాచరణను అమలు చేస్తున్నారు.
అల్పాహారం ఎప్పట్నుంచో?
పది విద్యార్థులకు ఇప్పటికే ప్రత్యేక తరగతులు ప్రారంభం కాగా జనవరి నుంచి రోజుకు 2 గంటల పాటు అదనంగా ప్రత్యేక తరగతులు ప్రారంభం కానున్నాయి. గతేడాది ఫిబ్రవరి 1నుంచి మార్చి 15 వరకు విద్యార్థులకు అల్పాహారం అందించారు. ఈసారి కూడా గతేడాది మాదిరిగానే సాయంత్రం వేళలో విద్యార్థులకు అల్పాహారం అందించవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే అభ్యాసదీపికల పంపిణీ
ఈ నెల 8నుంచి ప్రారంభమైన ప్రత్యేక తరగతులు
డిసెంబర్ నాటికి పూర్తికానున్న సిలబస్
జనవరి నుంచి రోజు అదనపు తరగతులు
వందశాతం ఉత్తీర్ణత సాధిస్తాం
గతేడాది రాష్ట్రస్థాయిలో పోల్చుకుంటే మెదక్ జిల్లా 12వ స్థానానికి పరిమితమైంది. ఈసారి వందశాతం ఉత్తీర్ణత సాధిస్తాం. అందుకు అనుగుణంగా ఇప్పటికే కార్యాచరణ రూపొందించాం. సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులను కొనసాగిస్తున్నాం.
–రాధాకిషన్, డీఈఓ మెదక్