
శాంతిభద్రతల్లో పోలీస్ కీలకం
అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ మున్సిపాలిటీ: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల కీలకమని, వారి ధైర్య సాహసాలకు ప్రజలు అండగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. మంగళవారం మెదక్‌జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అమరుల కుటుంబ సభ్యులతో టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు ధైర్యసాహసాలే ప్రధానమన్నారు. మెదక్ జిల్లాలో కూడా గత 20 ఏళ్లలో చాలామంది పోలీసులు చనిపోవడం బాధాకరమన్నారు. అమరుల త్యాగాలు మరువలేనివని, వారు చూపించిన ఆశయాల కొనసాగింపే వారికి నిజమైన నివాళి అని తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ..అమరవీరుల త్యాగాలు చాలా గొప్పవని, ప్రతీ ఏటా అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ ధైర్యసాహసాలతో పోలీసు డిపార్ట్‌మెంట్ మరింత ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.