
ఇసుకాసురులు!
మంజీరా నుంచి అక్రమంగా రవాణా
● ఇందిరమ్మ ఇళ్ల కంటూ దబాయింపు ● కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు
కొల్చారం(నర్సాపూర్): ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మండలంలోని పోతంశెట్టిపల్లి శివా రు మంజీరా నది నుంచి వారం రోజులుగా అక్రమంగా రవాణా చేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం ఉన్నా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమా ర్కులు అధికారులను మచ్చగా చేసుకొని మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ దందాను కొనసాగిస్తున్నార ని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా అడ్డుకుంటే ఇందిరమ్మ ఇళ్ల కంటూ దబాయిస్తున్నారు.
సొమ్ము చేసుకుంటున్న దళారులు
పోతంశెట్టిపల్లి, అప్పాజీపల్లి గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక రవాణా చేస్తామని చెప్పింది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న దళారులు మధ్యవర్తిత్వం వహిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్ ఇసుకకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి రూ. 8 వేలు వసూలు చేస్తున్నారు. బరితెగించి ఇతర ప్రాంతాలకు ఇసుకను రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. నది నుంచి ఇసుకను తీసేందుకు రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతి తప్పనిసరి. పైగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించే లబ్ధిదారుడు ఇసుక కోసం అనుమతి పత్రం అందజేయాల్సిన రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో లబ్ధిదారులు అధిక మొత్తానికి ఇసుకను కొనుగోలు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. బుధవారం పైతరలో పోలీసులు పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టడం విమర్శలకు తావిస్తోంది.
కఠిన చర్యలు తీసుకుంటాం
ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా ఇసుకను రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంటి నిర్మాణ ధ్రువీకరణ పత్రాన్ని రెవెన్యూ కార్యాలయానికి తీసుకొచ్చి అనుమతి తీసుకోవాలి. అందుబాటులో ఉన్న చోటు నుంచి ఇసుకను రవాణా చేసుకోవచ్చు. కేవలం రవాణా ఖర్చులు మాత్రమే లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్‌చారి, తహసీల్దార్, కొల్చారం