
నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి
పాపన్నపేట(మెదక్)/మెదక్ కలెక్టరేట్: ధాన్యం కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని పొడిచన్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడారు. ధాన్యం తేమ శాతాన్ని సరిగా నిర్ధారించాలని, తాలు లేకుండా చూడాలని సూచించారు. కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎప్పటికప్పుడు ధాన్యం తూకం వేసి తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. గన్నీ బ్యాగులు, రికార్డులు, ఆన్‌లైన్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ హాజరయ్యారు. నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాల శాఖ ద్వారా పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ఓటరు జాబితాలో వందేళ్ల వయసు కలిగిన ఓటర్లను గుర్తించి తగిన ఆధారాలు సమర్పించాలని తెలిపారు. బూత్‌స్థాయి అధికారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, ఫారం 6, 7, 8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓలు రమాదేవి, మహిపాల్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్