
అక్రమ నిర్మాణాలపై కొరడా
మెదక్ బల్దియా అధికారులు మాస్టర్‌ప్లాన్‌ను పక్కాగా అమలు చేస్తున్నారు. ఇటీవల నిబంధనలు అతిక్రమించి నిర్మించిన రెండు భవనాలను కూల్చివేశారు. అందులో ఓ భవనం గ్రీన్‌జోన్ పరిధిలో ఉండగా, మరో భవనం అనుమతిని మించి నిర్మించడంతో కఠినంగా వ్యవహరించారు. ఈ రెండు సంఘటనలతో మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించాలంటేనే పలువురు జంకుతున్నారు. – మెదక్‌జోన్
మెదక్ మున్సిపాలిటీ 1952లో ఆవిర్భవించింది. 18 వేల పైచిలుకు ఇళ్లు ఉండగా, సుమారు 80 వేల మంది ఇక్కడ నివసిస్తున్నారు. జనాభాతో పోటీపడి పట్టణ విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 1992లో దీనికి మాస్టర్‌ప్లాన్ అమలు చేయగా, ఇది అమల్లోకి వచ్చి 33 ఏళ్లు అవుతోంది. అయితే దీనిని ఇప్పటివరకు పక్కాగా అమలు చేసిన దాఖలాలు లేవు. దీంతో పట్టణంలో ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు కొనసాగించారు. అయినా అడ్డుచెప్పిన వారు లేరు. దీంతో అనేక రకాలుగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనట్లు పలువురు బహిరంగంగానే విమర్శిస్తుంటారు. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా పట్టణం అంతా జలమయంగా మారుతోంది.
ఇటీవల రెండు భవనాల కూల్చివేత
పట్టణంలో ఇటీవల అక్రమంగా నిర్మించిన రెండు భవనాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మిలటరీ కాలనీలో రోడ్డు పక్కన జీప్లస్ వన్ నిర్మాణం కోసం స్లాబువేశాడు. కాగా గ్రీన్‌జోన్‌లో ఇళ్లు నిర్మించటం నిషేధమని అధికారులు గుర్తించి నిర్మాణాన్ని నిలిపి వేయించారు. అలాగే అజంపుర ప్రాంతంలో గల ఏదులచెరువుకు సంబంధించి కొంత స్థలం ఉండగా, అందులో మహిళా జూని యర్ కళాశాలతో పాటు షాదీఖానాను ప్రభుత్వం నిర్మించింది. గతంలో పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇల్లు కూల్చివేయగా, అతడికి ఏదుల చెరువులో కొంత స్థలం కేటాయించారు. సదరు వ్యక్తి ఆ స్థలాన్ని ఇతరులకు విక్రయించాడు. దానిని కొనుగోలు చేసిన వ్యక్తి ఇటీవల ఆ ప్రదేశంలో షాపింగ్ (కమర్శియల్) భవనాన్ని నిర్మించాడు. కాగా కేటాయించిన దాని కన్నా ఎక్కువ స్థలంలో నిర్మించాడని గుర్తించిన అధికారులు కొంతభాగాన్ని కూల్చివేశారు. ఈ రెండు సంఘటనలతో మెదక్ బల్దియాలో అనుమతులు లేకుండా ఇళ్లు నిర్మించాలంటేనే పలువురు జంకుతున్నారు. అన్నిరకాల అనుమతులు ఉంటే తప్ప ఇళ్ల నిర్మాణాల జోలికి వెళ్లటం లేదు.
నిబంధనలు అతిక్రమించినకట్టడాల కూల్చివేత
మాస్టర్‌ప్లాన్ అమలులో భాగంగా కఠిన నిర్ణయాలు
అక్రమ నిర్మాణాలంటేనేజంకుతున్న వైనం