
గంజాయి సాగు చేస్తే పథకాలు కట్
మెదక్ కలెక్టరేట్: గంజాయి సాగు చేసే రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వెంటనే నిలిపివేస్తామని, జిల్లాలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు వేయాలని ఆదేశించారు. గంజాయి సాగు చేస్తే జరిగే పరిణామాలపై రైతులకు వివరించాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ డీవీ మాట్లాడుతూ.. దాబాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పరిశ్రమలకు ఉపాధి కోసం వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అనంతరం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో బ్లాక్ స్పాట్లు గుర్తించి ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఎక్కువగా ప్రమాదాలు జరిగే చోట సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి
జిల్లాలో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో కనీస మౌలిక వసతులతో పాటు సరిపడా గన్నీ బ్యాగ్‌లు, టార్పాలిన్లు, తేమశాతం కొలిచే యంత్రాలు అందుబాటులో పెట్టుకోవాలన్నారు. ఇదే విషయమై మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఉత్తమకుమార్‌రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం బాల్య వివాహాల నివారణ గోడ పత్రికను ఆవిష్కరించారు. అలాగే చేయూత పథకంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. వివిధ పింఛన్లకు గల అర్హతలను వాటి విధి విధానాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్‌తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
అధికారులతో కలెక్టర్ రాహుల్‌రాజ్