
‘జమ్మి’వనం..
ప్రత్యేకత చాటుకుంటున్న
తున్కిఖాల్సా పల్లెప్రకృతి వనం
వర్గల్(గజ్వేల్): అడవిలో ‘జమ్మి’ వనం ఊరందరికి చేరువైంది. పల్లె ప్రకృతికి శోభనిస్తోంది. పూజనీయమైన జమ్మి వృక్షాలతో వర్గల్ మండలం తున్కిఖాల్సా పల్లె ప్రకృతి వనం ప్రత్యేకత చాటుకుంటున్నది. గ్రామానికి అర కిలోమీటరు దూరంలో 5 జమ్మి వృక్షాలు ఒకేచోట సముదాయంగా పెరిగాయి. అక్కడే దసరా జమ్మీ పూజ నిర్వహించుకునేవారు. 2019లో పల్లెప్రకృతివనం ఆలోచన తెరపైకి వచ్చింది. ఆ వెంటనే రెండెకరాల విస్తీర్ణంలో జమ్మిచెట్లు మధ్యలో ఉండేలా పచ్చనిలాన్, చుట్టూరా వృత్తాకారంలో గద్దె, అక్కడే భారతమాత విగ్రహం, దేశభక్తికి చిహ్నంగా ఎత్తయిన జాతీయ జెండా, కూర్చునేందుకు సిమెంట్ బెంచీలు, తెలంగాణ సంస్కృతికి చిహ్మంగా బతుకమ్మ..ఇలా అన్ని కలగలసి పల్లెప్రకృతి వనం శోభాయమానంగా రూపుదిద్దుకున్నది. ఆహ్లాదతకు నెలవుగా, ఊరందరూ దసరా వేళ జమ్మి వృక్షాలు పూజించే ఆధ్యాత్మికతల కొలువుగా ప్రత్యేకత చాటుకుంటున్నది.