
ఇసుక నోస్టాక్..!
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకను అందుబాటులో ఉంచేందుకు జిల్లాలో అందోలు, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ప్రభుత్వం శాండ్ బజార్లు ఏర్పాటు చేసింది. డిజిటల్ మానిటరింగ్ సిస్టం ద్వారా విక్రయించేందుకు ఆర్భాటంగా కేంద్రాలను ప్రారంభించింది. అయితే అనుకున్నస్థాయిలో లబ్ధిదారులకు ఇసుకను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. శాండ్ బజార్ నిర్వాహకులు విఫలం చెందారనే విమర్శలున్నాయి.
– జోగిపేట(అందోల్)
జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 1,350 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారులకు ఇసుక భారం కాకుండా ఉండేందుకు జిల్లాలో అందోలు, నారాయణఖేడ్ ప్రాంతాల్లో శాండ్ బజార్లు ఏర్పాటు చేసింది. టన్నుకు రూ. 1,200 చొప్పున విక్రయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం శాండ్ బజార్‌లో ఇసుక అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద టన్నుకు రూ. 2,800 చొప్పున లబ్ధిదారులు కొనుగోలు చేయా ల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు వస్తుందో చెప్పడానికి కేంద్రం వద్ద ఎవరూ అందుబాటులో లేరు. ఇసుక రావొచ్చునన్న ఆశతో టేక్మాల్, పుల్కల్, అందోలు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు నిత్యం శాండ్ బజార్ల వద్దకు వచ్చి పోతున్నారు.
ఇబ్బంది పడుతున్నాం
ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాండ్ బజార్‌లో 15 రోజులు గా ఇసుక నిల్వలు లేవు. గత్యంతరంలేక టన్నుకు రూ. 2,800 చెల్లించి బయట కొనుగోలు చేస్తున్నాం. సెంటర్ వద్ద లబ్ధిదారులకు సమాచారం ఇచ్చే వారు లేరు. టన్నుకు రూ. 1,200 అయితే తమకు గిట్టుబాటు అవుతుంది. లేదంటే తలకు మించిన భారం అవుతుంది.
– నాగరాజు, లబ్ధిదారుడు, జోగిపేట
ఆందోళన చెందొద్దు
నల్గొండ, కొండపాక ప్రాంతాల నుంచి ఇసుక తీసుకువస్తాం. ప్రస్తుతం వర్షాల కారణంగా తీసుకురాలేకపోయాం. ఇప్పటివరకు అందోలులో 1,200 మెట్రిక్ టన్నులు, ఖేడ్‌లో 480 మెట్రిక్ టన్నుల ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు విక్రయించాం. త్వరలో ఇసుకను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు.
– శ్రీకాంత్, పీఓ, శాండ్ బజార్
ఇందిరమ్మ లబ్ధిదారుల పరేషాన్
15 రోజులుగా తప్పని తిప్పలు
టన్నుకు రూ. 2,800 వెచ్చించి
బయట కొనుగోలు
జిల్లాలో రెండు చోట్ల
శాండ్ బజార్ల ఏర్పాటు