
వరికి తెగుళ్ల బెడద
పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం శూన్యం
భారీ వర్షాలే
కారణమంటున్న అధికారులు
ఆందోళనలో అన్నదాతలు
మెదక్‌జోన్: ఖరీఫ్‌లో వరి సాగు కలిసి వస్తుందనుకున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. వరి పంట చేతికందే సమయంలో తెగుళ్లు ఆందోళనకు గురిచేస్తోంది. పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలే కారణమని అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో ఈఏడాది అన్నిరకాల పంటలు కలిపి 3.29 లక్షల ఎకరాలు సాగు కాగా, అందులో 3.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేశారు. అందులో 2.28 లక్షల ఎకరాల్లో దొడ్డురకం, 77 వేల ఎకరాల్లో సన్నా లు సాగు చేశారు. కాగా ఈ ఏడాది జిల్లాలో భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గొలకాటు, మెడవిరుపు, కాటుక తెగుళ్లు సోకి పాలుపోసే దశలో గింజలు పొల్లుపోతున్నాయి. అధికారులు సూచించిన పురుగు మందులు ఒకటికి, రెండుసార్లు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో అత్యధికంగా కొల్చారం, పాపన్నపేట, హవేళిఘణాపూర్, మెదక్, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, రామాయంపేట, నిజాంపేట, నర్సాపూర్, శివ్వంపేట, తూప్రాన్ తదితర మండలాల్లో అధికంగా వరి సాగు చేశారు. టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడు, పెద్దశంకరంపేట మండలాల్లో పత్తి సాగు చేశారు. పత్తికి సైతం కాయకుళ్లు, ఎండుతెగులు సోకి తీవ్ర నష్టం జరిగింది. చిరుపొట్ట దశలో భారీ వర్షాలు కురవడంతోనే పంటలకు తెగుళ్లు ఆశించినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
పంటంతా దెబ్బతింటుంది
నాకున్న రెండెకరాల్లో దొడ్డురకం వరి సాగు చేశాను. భారీ వర్షాలతో గొలకాటు వచ్చింది. ప్రస్తుతం వరి గింజలు పాలు పోసుకొనే దశలో పంటంతా దెబ్బతింటుంది. ఇప్పటికీ రెండుసార్లు పురుగు మందులు పిచికారీ చేశారు. వర్షాలతో పనిచేయకుండా పోయింది. ఇది మూడోసారి పిచికారీ చేస్తున్నాను.
– ఆంజనేయులు, రైతు చందాపూర్

వరికి తెగుళ్ల బెడద