
మా సమస్యలు పరిష్కరించండి
మెదక్ కలెక్టరేట్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డెయిలీ వైజ్, కాంటింజెంట్ వర్కర్లు ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు దొడ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. 212 జీఓను సవరించి 2014 నాటికి ఐదేళ్ల సర్వీస్ ఉన్న వారందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు ట్రెజరీలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. కొత్త మెనూ, పెరిగిన పనిభారానికి అనుగుణంగా కార్మికులను పెంచాలన్నారు. విద్యార్థులతో పాటు కార్మికులకు సైతం రెండు జతల యూనిఫాం, ఐడీ కార్డులు ఇవ్వాలన్నారు. కార్మికులకు రూ. 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సునంద, కోశాధికారి మాధవి, శేఖర్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.