
నష్టపరిహారం ఎప్పుడో?
జాప్యంతో అన్నదాతల్లో ఆందోళన
జిల్లాలో 6,500 ఎకరాల్లో
దెబ్బతిన్న పంటలు
ప్రభుత్వానికి నివేదించిన అధికారులు
గత నెల చివరివారంలో కురిసిన భారీ వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. స్పందించిన సర్కార్ పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పింది. ఆ మేరకు అధికారులు సర్వే చేసి పంట నష్టం వివరాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వనికి నివేదించారు. నెల రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు పరిహారం అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
– రామాయంపేట(మెదక్)
జిల్లా పరిధిలో భారీ వర్షాలకు 6,500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 1,060 ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. నెల రోజులుగా ఇంకా కొన్ని పంటచేన్లు నీటిలోనే ఉన్నాయి. రంగుమారి పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే నష్టపోయిన రైతా ంగాన్ని ఆదుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. అధికారులు గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటల వివరాలు ప్రభుత్వానికి నివేదించారు. నెల రోజులుగా నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్న రైతులు వ్యవసాయ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వర్షాలతో ప్రధానంగా వరి పంట తీవ్రంగా దెబ్బతింది. 5,850 ఎకరాల్లో నష్టం జరిగిందని అధికారుల సర్వేలో తేలింది. దీనికి తోడూ పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది.
11 ఎకరాలు మాత్రమే గుర్తింపు
భారీ వర్షాలతో జిల్లా పరిధిలో 1,060 ఎకరాలకు పైగా పంట చేలల్లో ఇసుకమేటలు వేసింది. ఈసీజన్‌లో తొలగించుకోవడం సాధ్యం కాదని భావిస్తున్న రైతులు కొందరు వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఇసుకమేటలు తొలగించాలంటే రూ. లక్షలు ఖర్చవుతాయని, ఈ పరిస్థితుల్లో తాము అంత డబ్బు ఖర్చుపెట్టే పరిస్థితుల్లో లేమని చెబుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో పంటలను అలాగే వదులుకుంటున్నామని వాపోతున్నారు. కాగా రామాయంపేట, నార్సింగి, హవేళిఘణాపూర్ మండలాల్లో మొదటి విడతగా 11 ఎకరాలను మాత్రమే గుర్తించిన అధికారులు, సదరు భూముల్లో నుంచి ఇసుకమేటలు తొలగిస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి నివేదించాం
దెబ్బతిన్న పంటల వివ రాలు సర్వే చేసి ప్రభుత్వా నికి నివేదించాం. నష్టపరిహారం విషయం తమ పరిధిలో లేదు. ఇసుకమేటలు వేసిన భూములను గుర్తించాం. పైఅధికారుల ఆదేశాల మేరకు ముందుకెలుతాం.
– దేవ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి
తీవ్రంగా నష్టపోయాం
గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పంటలు కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయాం. పంట చేన్లు ఇసుకమేటలు, రాళ్లుతో నిండిపోయాయి. వీటి కి తొలగించుకోవడం తమతో సాధ్యం కాదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– దేవ్‌జా, రైతు, కోనాపూర్ తండా

నష్టపరిహారం ఎప్పుడో?

నష్టపరిహారం ఎప్పుడో?