
పురాభివృద్ధికి నిధులు
● నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు
● తీరనున్న ప్రధాన సమస్యలు
నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపాలిటీకి నగరాభివృద్ధి పథకం కింద ప్రభుత్వం రూ. 15 కోట్లు మంజూరు చేసింది. పలు ప్రత్యేక పనులతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మా ణాలకు ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. త్వరలో టెండర్లు వేసి నిబంధనల మేరకు పనులు చేపట్టే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
చెరువుల సుందరీకరణ
నిధుల కేటాయింపులో భాగంగా పట్టణానికి చెందిన రాయరావు చెరువు, కోమటికుంట సుందరీకరణ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. రాయరావు చెరువుకు రూ. 1.20 కోట్లు, కోమటి కుంటకు రూ. 1.20 కోట్లు కేటాయించింది. కాగా నర్సాపూర్– మెదక్ జాతీయ రహదారి నుంచి డంపింగ్ యార్డు వరకు సీసీ రోడ్డు నిర్మించేందుకు రూ. కోటి 80 లక్షలు కేటాయించింది. ఈ మార్గంలో సీసీ రోడ్డు నిర్మిస్తే చాలా మంది రైతులకు మేలు జరుగనుంది. కాగా మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో వ్యాపార షాపింగ్ కాంప్లెక్స్ నిర్మా ణానికి రూ. కోటి 20 లక్షలు మంజూరు కాగా, మున్సిపాలిటీకి శాశ్వత ఆదా యం వచ్చే అవకాశం ఉంటుంది. పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలోని కొంత ఏరియా నుంచి మురికి నీరు చెరువులోకి వెళ్లడంతో కలుషి తం అవుతుతోంది. దీంతో మురికి నీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి రూ. 70 లక్షలు కేటాయించింది. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని పిల్లల పార్కు వసతుల లేమితో నిరుపయోగంగా ఉన్నందున పార్కు అభివృద్ధికి తాజాగా ప్రభుత్వం రూ. 30 లక్షలు కేటాయించింది.
సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం
మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం రూ. 10.40 కోట్లు కేటాయించింది. ఆయా వార్డులలో చేపట్టాల్సిన పనుల ప్రాధాన్యత మేరకు ఒక్కో వార్డుకు రూ. 30 నుంచి రూ. 60 లక్షల వరకు నిధులు కేటాయించారు. సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మాణం పూర్తయితే చాలా వార్డులలో ప్రజల ఇబ్బందులు కొంత మేర తీరనున్నాయి.
నిబంధనల మేరకు పనులు
ప్రభుత్వం మున్సిపాలిటీ నగరాభివృద్ధి కింద మంజూరు చేసిన రూ. 15 కోట్లతో నిబంధనల మేరకు అభివృద్ధి పనులు చేపడతాం. నిధులలో అన్ని వార్డులతో పాటు ప్రత్యేకంగా పలు పనులకు నిధులు కేటాయించారు. వీటితో పట్టణంలో చాలా సమస్యలు పరిష్కారం కానున్నాయి.
– శ్రీరాంచరణ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్