
పోషకాహరంతోనే సంపూర్ణ ఆరోగ్యం
టేక్మాల్(మెదక్): గర్భిణులు, బాలింతలు పోషకారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని సీడీపీఓ పద్మలత అన్నారు. మండలంలోని బొడ్మట్‌పల్లిలో అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం పోషణ మాసం సంబురాలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు అందిస్తున్న పోషక పదార్థాలను ప్రదర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మునగాకులో విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని, అవి రోగనిరోధక శక్తిని పెంచుతాయన్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియత్రించి, 340 రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఉంటుందని చెప్పా రు. అనంతరం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. సూపర్‌వైజర్ కలాలి కృష్ణవేణి, అంగన్‌వాడీ టీచర్లు దీపిక, లక్ష్మి, ఏఎన్‌ఎం జయప్రద, సావిత్రి, అంగన్‌వాడీ హెల్పర్లు గడ్డం అమల, దుర్గరాణి తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ ఏడీఏ రాజ్‌నారాయణ
రామాయంపేట(మెదక్): వరి సాగులో వివిధ దశల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ, సమగ్ర పోషక యజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్‌నారాయణ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ఆర్ వెంకటాపూర్‌లో పలు వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి మాట్లాడారు. ప్రతి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు ఎంటీయు 1010 రకం వరి విత్తనాలను అందజేశామన్నారు. వారు పండించిన ఉత్పత్తులను ఇతర రైతులకు అందజేస్తామని తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త నిర్మల మాట్లాడుతూ.. చిరు పొట్ట దశలో చీడపీడలు సోకకుండా పంటలకు వాడాల్సిన మందులను పిచికారీ చేయాలని సూచించారు. పంటచేలకు మోతాదుకు మించి యూరియా వాడితే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
కౌడిపల్లి(నర్సాపూర్): వరి, పత్తి పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, తెగుళ్లను నివారించాలని తునికి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని రాయిలాపూర్‌లో వరి, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వరిలో కాండంతొలుచు, కంకినల్లి పురుగుల ఉధృతిని గమనించామన్నారు. కాండంతొలుచు పురుగు నివారణకు ఐసోసైక్లోసిరమ్120మి.లీ, లేదా క్లోరానిట్రిలిప్రోల్ 60మి.లీ, ఎకరాకు పిచికారీ చేయాలని తెలిపారు. కంకినల్లి నివారణకు స్పైరోమెసిఫిన్ 200మి.లీ, ప్రోజికొనజోల్ 200మి.లీ, ఎకరాకు పిచికారీ చేయాలని సూచించారు. రైతులు రోజు పంటను పరిశీలించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు.
తూప్రాన్: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్‌ఆర్) కోసం భూములు కోల్పోతున్న రైతులు పరిహారం కోసం వెంటనే బ్యాంకు అకౌంట్లను అందజేయాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిపుల్‌ఆర్ కోసం భూసేకరణ పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేశామని, భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందిస్తామన్నారు. ఇప్పటి వరకు 630 మంది రైతులకు గాను 505 మాత్రమే బ్యాంకు అకౌంట్లు అందజేశారని తెలిపారు.
మెదక్ కలెక్టరేట్: ముస్లిం మైనార్టీల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల బలోపేతానికి ప్రభుత్వం ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకం తెచ్చి నట్లు జిల్లా ఇన్‌చార్జి మైనార్టీ వెల్ఫేర్ అధికారి విజయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం మహిళలకు రూ.50 వేల వరకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు 21 నుంచి 55 యేళ్ల మధ్య వయస్సు కలిగిన ఫకీర్, దూదెకుల, దుర్బాల వర్గానికి చెంది ఉండాలన్నారు. ఐదేళ్లలో ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి పొందలేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత గల మహిళలు అక్టోబర్ 6వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం 8142741976 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

పోషకాహరంతోనే సంపూర్ణ ఆరోగ్యం