
ఆలయ భూమిని కబ్జా చేస్తే ఊరుకోం
● అంబాజీపేట గ్రామస్తుల రాస్తారోకో
● పనులు చేయించేందుకు వచ్చిన వ్యక్తిని చితకబాదిన వైనం
చిన్నశంకరంపేట(మెదక్): దుర్గామాత ఆలయానికి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకునేది లేదని చిన్నశంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామస్తులు తేల్చి చెప్పారు. కబ్జా చేసిన స్థలంలో ప్రహరీ గోడ నిర్మించేందుకు రియల్టర్ తరఫు మనిషి పనులు చేయించేందుకు రాగా అతడిని గ్రామస్తులు చితకబాది వెనక్కి పంపించారు. ఆలయ భూమి కాపాడాలంటూ మెదక్–చేగుంట ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో వెలసిన దుర్గామాత ఆలయం ముందు ఖాళీ స్థలాన్ని హైదరాబాద్‌కు చెందిన ఓ రియల్టర్ కబ్జా చేయగా ఈ విషయమై అప్పటి నుంచి సదరు గ్రామస్తులకు అతడికి మధ్య వివాదం నడుస్తోంది. తాజాగా సదరు రియల్టర్ అక్కడ ప్రహరీ నిర్మించేందుకు అతడి తరఫున ఓ వ్యక్తిని పనుల నిమిత్తం అక్కడకు పంపించాడు. అయితే పునాదులు తవ్వుతుండగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు పనులు నిలిపివేయించి అతడిని చితకబాదారు. అనంతరం ఆలయ భూమిని కాపాడాలంటూ రోడ్డుపై రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు. అనంతరం డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ వెంకటరాజంగౌడ్ దుర్గామాతను దర్శించుకుని మొక్కుకున్నారు.