
పారదర్శకత విజయ ప్రత్యేకత
● నాణ్యమైన పాల సరఫరాయే లక్ష్యం
● జీఎం మధుసూదన్ రావు
మెదక్ కలెక్టరేట్: పారదర్శకత విజయ డెయిరీ ప్రత్యేకత అని రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ మధుసూదన్‌రావు తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారులకు అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. స్వచ్ఛమైన పాల సేకరణ, సరఫరాపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు. రైతుల నుంచి పాలు సేకరించే సమయంలోనే ఎనలైజర్లతో పరీక్షించి కొనుగోలు చేస్తున్నామన్నారు. విజయ డెయిరీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెడుతున్నట్లు తెలిపారు. పలు రకాల పరీక్షలు చేసిన తర్వాతే వినియోగదారులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన పాల పదార్థాలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో పలు రద్దీ ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలను గుర్తిస్తామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తామని చెప్పారు. సమావేశంలో అధికారులు, ప్రసన్న, కల్యాణి, విజయ్, అవినాష్, రమేష్, మెదక్ , జహీరాబాద్, నారాయణఖేడ్ కేంద్రాల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.