
జీఓ12ను వెంటనే సవరించాలి
భవన నిర్మాణ రంగ కార్మికుల యూనియన్ నేతల డిమాండ్
మెదక్ కలెక్టరేట్: భవన నిర్మాణ సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్‌న్స్ కంపెనీలకు అప్పగించే జీఓ నంబర్ 12ను వెంటనే సవరించాలని తెలంగాణ భవన నిర్మాణ రంగ కార్మికుల యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చింతల గౌరయ్య మాట్లాడుతూ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలని, అక్రమంగా ప్రైవేట్ బీమా కంపెనీలకు ఇచ్చిన రూ.346 కోట్లు తిరిగి వెల్ఫేర్ బోర్డులోనే జమ చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ నియమించి, వారి నిర్ణయం ప్రకారం వెల్ఫేర్ బోర్డు నిధులను ఖర్చు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్, తెలంగాణ బిల్డింగ్ ఇతర నిర్మాణ సంఘాల నాయకులు అప్జల్, స్వామి, భిక్షపతి, చందు, పవన్ కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.